ప్రజాశక్తి - అమలాపురం : వ్యవసాయ రంగాన్ని డిజిటల్ పరిజ్ఞానంతో అనుసంధానిస్తూ దేశంలోని ప్రతి రైతుకు ప్రత్యేక డిజిటల్ గుర్తింపును కల్పించాలనే ప్రధానమంత్రి లక్ష్యంలో భాగంగా అగ్రి స్టాక్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం అమలులో భాగంగా జిల్లాస్థాయి అగ్రి స్టాక్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించి సంబంధిత శాఖల అధికారులతో పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రతి రైతుకు 11 అంకెలతో కూడిన ప్రత్యేక యూనిక్ ఫార్మర్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను అందించడం అగ్రి స్టాక్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. జిల్లాలోని 297 రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి రైతును ఈ డిజిటల్ గుర్తింపు వ్యవస్థలో నమోదు చేసి, ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 1.43లక్షల మంది రైతులకు 11 అంకెల ప్రత్యేక ఫార్మర్ ఐడిలు సృష్టించినట్లు వెల్లడించారు. మిగిలిన రైతుల వివరాలను కూడా సమగ్రంగా నమోదు చేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. అగ్రి స్టాక్ ఫార్మర్ ఐడీ ద్వారా రైతు వ్యక్తిగత వివరాలు, సాగు చేస్తున్న పంటల వివరాలు, వ్యవసాయ భూముల వివరాలు, సాగునీటి సదుపాయాలు, పంటల సాగు విధానం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు (ప్రొక్యూర్మెంట్), పంటల విక్రయాలు, మార్కెటింగ్ ద్వారా పొందిన ఆదాయం వంటి సమగ్ర సమాచారాన్ని డిజిటల్ రూపంలో అనుసంధానం చేస్తారన్నారు. ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సేవలు మరింత పారదర్శకంగా, సులభంగా అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. సేవల పంపిణీలో మరింత పారదర్శకత, సమర్థత పెరుగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలోని ప్రతి రైతుకు ఫార్మర్ ఐడీ అందేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ప్రతీ రైతుకు డిజిటల్ గుర్తింపు
13 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026, 07:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)