మంగళవారం, 27 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డులతో విశిష్ట సేవకులకు సత్కారం

1 గంట క్రితం

aalamuru-1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 04:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : హైదరాబాద్‌లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఈ నెల 25న యువ ఆర్ట్స్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానం చేశారు. ఈ వివరాలను చొప్పెల్ల లాకుల ఇరిగేషన్‌ కన్జర్వెన్సీ అసిస్టెంట్‌, జేఏసీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్స్‌ ఏపీ రాష్ట్ర ఛైర్మన్‌ కేతా శ్రీనివాసరావు మంగళవారం స్థానిక విలేకరులకు వెల్లడించారు. తన అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలలో హర్యానా మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాల చారి ముఖ్య అతిథులుగా, అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో, సినీ నిర్మాత, దర్శకుడు డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము గౌరవ అతిథిగా పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి, జోన్-2 కోఆర్డినేటర్ చెల్లిబోయిన శ్రీనివాసరావు, జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ గుత్తుల మీరకుమార్ తదితరులు అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా కేతా శ్రీనివాసరావు మాట్లాడుతూ, పేద కుటుంబంలో జన్మించిన డాక్టర్ అబ్దుల్ కలాం కష్టపడి చదివి గొప్ప శాస్త్రవేత్తగా, భారత 11వ రాష్ట్రపతిగా ఎదిగి యువతకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. కలాం ఆశయాలు, స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. అవార్డు గ్రహీతలు చెల్లిబోయిన శ్రీనివాసరావు, గుత్తుల మీరకుమార్ మాట్లాడుతూ, కలాం నిరాడంబర జీవితం, పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆయన చేసిన సహాయం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం యువ ఆర్ట్స్ థియేటర్స్ అధినేత డాక్టర్ బి.ఆర్. వెంకటరమణ సేవలను అతిథులు ప్రశంసించి ఘనంగా సన్మానించారు. పలువురు రాజకీయ ప్రముఖులు, సంఘసేవకులు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని శ్రీనివాసరావు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్