ప్రజాశక్తి-అమలాపురం (కోనసీమ) : ముంపుకు గురయ్యే ప్రాంతాలను ముందుగా గుర్తించి సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. వరద పరిస్థితులపై జిల్లా స్థాయి అధికారులు, ఆర్‌డీవోలు, తహశీల్దార్లు, మండల స్థాయి అధికారులతో శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించిన ఆయన, ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 11.4 అడుగులకు చేరగా, 9.38 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. రానున్న అరగంట నుంచి గంట వ్యవధిలో తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. భద్రాచలం వద్ద 55.9 అడుగుల నీటిమట్టంతో 15.84 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదవుతోందని, ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు రాత్రి రెండో ప్రమాద హెచ్చరిక వచ్చేఅవకాశముందని వివరించారు. అయితే తుమ్మగూడెం వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో అనంతరం పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని తెలిపారు.వరద ప్రభావిత గ్రామాలు, లంక ప్రాంతాలు, కాలువలు, ఏరులు, క్రాసింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల్లో సహాయక శిబిరాలు, అవసరమైన సామగ్రి, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో స్థానిక యంత్రాంగం, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో సురక్షిత రవాణా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. వరద పరిస్థితులు ఉన్నప్పటికీ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కలెక్టర్, జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి బాలయోగి ఆలయం సహా నదీ స్నాన ఘట్టాల వద్ద భక్తులు, ప్రజలు నీటిలోకి దిగకుండా రెవెన్యూ, పోలీసు శాఖలు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా అధికారుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ముంపుకు గురయ్యే ప్రాంతాలను ముందుగా గుర్తించండి : జిల్లా కలెక్టర్
01 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 01, 2026, 03:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)