- మంత్రి వాసంశెట్టి సుభాష్
ప్రజాశక్తి-రామచంద్రపురం : ప్రజాస్వామ్యానికి పత్రికలు పునాది వంటివని, ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర వెలకట్టలేనిదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఆయన పత్రికా విలేకరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజల పక్షాన నిలుస్తూ నిష్పక్షపాతంగా సమాజానికి సేవలందిస్తున్న ప్రతీ జర్నలిస్టు అభినందనీయులని పేర్కొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పిలువబడే మీడియా సమాజానికి దిశానిర్దేశం చేయడంలో, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ముందుంటోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకురావడంలో పత్రికలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో జర్నలిస్టులు క్షేత్రస్థాయిలో ఉంటూ సమాచారాన్ని అందించడం వారి వృత్తి నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. వాస్తవాలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తూ వార్తలను అందించి, ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని మంత్రి ఆకాంక్షించారు.








కామెంట్లు (0)