ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : కాకినాడలో నిర్వహించిన ర్యాలీ, కలెక్టరేట్ ధర్నాపై పోలీసులు నిర్బంధ, బెదిరింపు చర్యలకు పాల్పడటాన్ని పీ.డీ.ఎస్.యు విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండించింది. నిరుద్యోగుల ధర్నా అనంతరం శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత జి. శ్యామ్‌ను పోలీసులు విచారించడం, ఆయనతో పాటు సుమారు 20 మంది విద్యార్థులపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య హక్కుల పై దాడి అని. నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా ఉద్యమించిన వారిపై కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమని పిడిఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్దు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం నుండి మంగళవారం తెల్లవారుజామున వరకు శ్యామ్ ఇనిస్టిట్యూట్ హాస్టల్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించి, ధర్నాలో పాల్గొన్న విద్యార్థుల నుంచి ఆధార్ కార్డులు తీసుకోవడం, కొంతమంది ఆధార్ కార్డులు సేకరించడం ఆందోళనకరమన్నారు. ఆధార్ కార్డులను ఏ ప్రాతిపదికన సేకరించారో పోలీసులు సమాధానం చెప్పాలని, అనుమతి లేకుండా హాస్టల్‌లో తనిఖీలు ఎందుకు చేశారని ప్రశ్నించిన జి. శ్యామ్‌కు వన్‌టౌన్ సీఐ “అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు” అని చెప్పడం సరికాదన్నారు. పోలీసులు కూడా చట్టానికి లోబడే పనిచేయాలని అన్నారు. విద్యార్థులపై కేసులు పెట్టి ఉద్యమాలను భయపెట్టలేరని, పోలీస్ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేసి మెగా పోలీస్ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత గొంతును కేసులతో నొక్కితే ఉద్యమాలు మరింత ఉధృతమవుతాయని హెచ్చరించారు..డైరెక్టర్ జి. శ్యామ్, విద్యార్థులపై నమోదు చేసిన కేసులు వెంటనే ఉపసంహరించాలనీ, .సేకరించిన విద్యార్థుల ఆధార్ కార్డులను తిరిగి ఇవ్వాలనీ,.హాస్టల్ తనిఖీలపై పూర్తి వివరాలు వెల్లడించాలనీ, విద్యార్థులను, నిరుద్యోగ యువతను భయపెట్టే చర్యలు నిలిపివేయాలనీ, మెగా పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల గొంతు నొక్కితే ఉద్యమం ఉదృతం చేస్తామని, విద్యార్థులు, నిరుద్యోగ యువత పక్షాన పీ.డి.ఎస్.యు ఐక్యంగా నిలబడుతుందని బి. సిద్ధు స్పష్టం చేశారు. కేసులు ఎత్తివేసే వరకు, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
విద్యార్థులపై పోలీసుల దమనకాండను ఆపాలి : పీ.డి.ఎస్.యు డిమాండ్
46 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 02:39 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)