బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కళ్లముందే కుళ్లిన కష్టం

13 నవంబర్, 2026

కళ్లముందే కుళ్లిన కష్టం
- చేసేది లేక ట్రాక్టర్‌తో దమ్ము చేసిన రైతు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 07:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- చేసేది లేక ట్రాక్టర్‌తో దమ్ము చేసిన రైతు

ప్రజాశక్తి - ముమ్మిడివరం(డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా) : ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందే సమయంలో తుపాను రూపంలో వచ్చిన ప్రకృతి వైపరీత్యం అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 15 ఎకరాల్లోని వరి పంట పూర్తిగా నేలవాలి, నీట మునిగి కుళ్లిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఓ రైతు తన పంటను తానే ట్రాక్టర్‌తో దమ్ము చేసి దున్నేశాడు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని బొండాయి కోడుతూము ప్రాంతానికి చెందిన రైతు గొరింట రాంబాబు రాజు వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది తన సొంత భూమి ఐదు ఎకరాలతో పాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. మొత్తం 15 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఇటీవల ఆర్నబ్, మురసు తుపానుల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరి పంట పూర్తిగా నేలవాలింది. నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో పంట మొత్తం కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. పంటను కాపాడుకునే మార్గం లేక విధిలేని పరిస్థితుల్లో శుక్రవారం ట్రాక్టర్‌ తో పంటను దమ్ము చేసేశారు. ఈ ఘటన పలువురిని కంట తడి పెట్టించింది. తుపాను కారణంగా సుమారు రూ.తొమ్మిది లక్షల వరకు పంట నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి పంట నష్టాన్ని నమోదు చేసుకుని వెళ్లారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్ట పరిహారం అందించాలని కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్