* ఎల్‌నినోపై అవగాహన కల్పనలో ప్రభుత్వం విఫలం
ప్రజాశక్తి-కోడూరు
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు, సాగునీటి లభ్యతపై రైతులకు ముందస్తు సమాచారం, అవగాహన కల్పించడంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఘోరంగా విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం, అధికారుల ఉదాసీన వైఖరి, సమన్వయ లోపం కారణంగానే నేడు దివిసీమ ప్రాంత రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడి, తీవ్ర ఆర్థిక నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ కృష్ణాజిల్లా కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ ఆధ్వర్యంలో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లోని తుంగలవారిపాలెం, మర్రిపాలెం, మందపాకల, పాదాలవారిపాలెం, జరుగువానిపాలెం, స్వతంత్రపురం తదితర గ్రామాల్లో సిపిఐ రైతు సంఘం బృందం విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటన చేపట్టింది. ఈ సందర్భంగా సాగునీరు అందక బీడుగా మారిన పంట పొలాల్లోకి నేతలు స్వయంగా దిగి, స్థానిక రైతులను నేరుగా కలిసి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. ఏటా సాగు కోసం చేసే ఖర్చులతో పోలిస్తే, ఈ ఏడాది ఒక్కో ఎకరానికి అదనంగా రూ.10 వేలకు పైగానే భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కాలువల్లో చుక్క నీరు లేకపోవడంతో గత్యంతరం లేక ఆయిల్ ఇంజన్లు పెట్టి మాత్రమే నీటిని పొలాల్లోకి తోడుకోవాల్సి వస్తోందని, నిత్యం డీజిల్ కోసం వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని వాపోయారు. అనంతరం కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ దివిసీమలో ఇంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నా స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల కష్టాలను, వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం లేదని విమర్శించారు. దివిసీమలో సాగు విస్తీర్ణం భారీగా పడిపోవడానికి ప్రభుత్వ ప్రణాళికారాహిత్యమే ప్రధాన కారణమని అన్నారు. ఆంద్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమానుల సురేంద్ర నాథ్ బెనర్జీ, రైతు సంఘం సభ్యులు చండ్ర సుబ్బారావు, మలిపెద్ది బోసు, కొర్రపాటి ముఖర్జీ, వేమూరి రత్నగిరి పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)