ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
అగ్రిగోల్డ్ సంస్థలో ప్లాట్లు కొనుగోలు చేసి, పూర్తి మొత్తాన్ని చెల్లించి రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు తొలి విడతలో న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్యల పరిష్కారానికి మంత్రుల సబ్ కమిటీ సమావేశాలను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. బుధవారం సచివాలయంలో అగ్రిగోల్డ్‌పై మంత్రుల సబ్ కమిటీ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిసిఎల్‌ఎతోపాటు పోలీస్, మున్సిపల్, అటవీ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్న 35,544 మంది బోనఫైడ్ లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 42,531 మంది ప్లాట్ల లబ్ధిదారులు ఉండగా, మరో 6,989 మంది పూర్తి మొత్తాన్ని చెల్లించినప్పటికీ రిజిస్ట్రేషన్లు పూర్తి కాలేదని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తికాని వారికి రెండో విడతలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రిజిస్ట్రేషన్లు పూర్తయిన ప్లాట్లకు సంబంధించి భూములు ప్రస్తుతం 22(ఎ) నిషేధిత జాబితాలో ఉన్నందున, వాటిని ఆ జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లాల కలెక్టర్లతో త్వరలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, న్యాయపరమైన సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అగ్రిగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టిన బాధితుల నుంచి బాండ్ల వివరాలు సేకరించేందుకు 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాధితులు ఒరిజినల్ బాండ్‌ను చూపించి, దాని జిరాక్స్ కాపీని ప్రత్యేక బృందాలకు అందజేయాలని సూచించారు. ఎపిలో ఏడు, తెలంగాణలో మూడు, ఇతర రాష్ట్రాల్లో మరో పది బృందాలు రెండు, మూడు రోజుల్లో క్షేత్రస్థాయిలో పనిచేయనున్నట్లు వెల్లడించారు. అగ్రిగోల్డ్ గతంలో సేకరించిన భూముల్లో చేపట్టిన ప్లాంటేషన్‌ను అటవీశాఖ సమగ్రంగా పరిశీలించనుందని, ఇందుకోసం ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి, అక్కడ ఉన్న వృక్ష సంపదను ఆడిట్ చేసి దాని విలువను అంచనా వేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హోంమంత్రి వంగలపూడి అనిత, వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)