ప్రజాశక్తి-మార్కాపురం
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలలోని 18 ఏళ్లు నిండిన యువతకు రూ.రెండు లక్షలు పరిహారం ఇచ్చేందుకు బుధవారం వెరిఫికేషన్ మొదలైంది. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఈ ప్రక్రియను చేపట్టారు. తొలి రోజున అర్ధవీడు మండలంలోని వెలిగొండ ప్రాజెక్టు ముంపులో గల రామలింగేశ్వరపురం, సాయిరాం నగర్, కృష్ణానగర్, లక్ష్మీపురం, మార్కాపురం మండలంలోని గొట్టిపడియ, అక్కచెరువు తండా, పెద్దారవీడు మండలంలోని గుండంచర్ల, కాటమరాజుతండా గ్రామాల వారికి వెరిఫికేషన్ ఏర్పాటు చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభించిన ఆగస్టు 31వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన నిర్వాసిత యువత సర్టిఫికెట్లు, ఆధార్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు తదితరాలను పరిశీలించారు. ఈ పరిశీలన కోసం 11 కౌంటర్లను ఏర్పాటు చేశారు. వెరిఫికేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ విజయసునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పర్యవేక్షించారు. సిపిఎం ఆందోళనతో ప్రభుత్వం యువతకు రూ.రెండు లక్షలు ఇచ్చేందుకు జిఒ విడుదల చేసిన సంగతి తెలిసిందే.








కామెంట్‌లు (0)