ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
స్వర్ణ ఆంధ్రప్రదేశ్–2047 లక్ష్యాల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిర్దేశించిన అభివృద్ధి ప్రణాళికల ప్రకారం జిల్లాల వారీగా అవసరాలు, వనరులు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక, సామాజిక అభివృద్ధి అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని కార్యాచరణ ప్రణాళికలు రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వైజాగ్ ఎకనామిక్ జోన్ వి ఈ ఆర్ ,తిరుపతి ఎకనామిక్ జోన్ టిఈఆర్, అమరావతి ఎకనామిక్ జోన్ విఈఆర్, పరిధిలోని జిల్లాలను అనుసంధానం చేస్తూ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించే ప్రక్రియలో భాగంగా కృష్ణా జిల్లాలో వివిధ శాఖల అధికారులతో బుధవారం కలక్టరే సమావేశం హాలులో సమీక్షలు, సంప్రదింపులు నిర్వహించారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 21, 22 తేదీల్లో పిడబ్ల్యూసి సంస్థకు చెందిన శ్రీ స్వస్తిక్ త్యాగి, కన్సల్టెంట్, ఎ. సాయి సిరిప్రియ, కన్సల్టెంట్ జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై జిల్లాకు సంబంధించిన అభివృద్ధి అంశాలపై సమాచారాన్ని సేకరించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న పోర్టు, ఫిషింగ్ హార్బర్, ఇమిటేషన్ జ్యువలరీ యూనిట్లు తో పాటుగా మల్లవల్లిలోని పారిశ్రామిక వాడను సందర్శించి జిల్లాలో సమాచారం సేకరించి ఉన్నారు. వ్యవసాయం, ఆహారశుద్ధి, పరిశ్రమలు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు, ఇతర అభివృద్ధి రంగాలకు సంబంధించిన అంశాలను వారు పరిశీలించారు. అదేవిధంగా సెప్టెంబరు 23న నిర్వహించిన వర్క్‌షాప్‌లో వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, పరిశ్రమలు, మెప్మా, మ్యారీ టైం బోర్డ్ , డిఆర్డిఏ, తదితర శాఖల అధికారులు పాల్గొని తమ శాఖలకు సంబంధించిన సమాచారం, అభివృద్ధి అవకాశాలు, భవిష్యత్ అవసరాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై వివరాలను అందించారు. వర్క్‌షాప్ సందర్భంగా జిల్లాకు సంబంధించిన అభివృద్ధి అవసరాలు, ప్రస్తుత వనరులు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల అవకాశాలు, వివిధ రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.








కామెంట్‌లు (0)