ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా)
ఎమ్మెల్సీ ఎన్నికలలో బోగస్ ఓటర్ల నమోదు నియంత్రించాలని యుటిఎఫ్ కృష్ణాజిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి యువి సుబ్బారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 2027 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు బోగస్ ఓటర్లు నమోదు కాకుండా నియంత్రించాలన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుకు ప్రవేట్ ఆన్ఎయిడెడ్ ఉపాధ్యాయుల సర్వీస్లను పరిశీలించి సర్వీస్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో సదరు ఉపాధ్యాయులకు సర్వీస్ సర్టిఫికెట్ జారీ చేసేటప్పుడు 2021 నుండి 2026 వరకు యు-డైస్ వివరాలు, సంబంధిత పాఠశాలలో పనిచేసిన కాలపు అటెండెన్స్ రిజిష్టర్, జీతాల చెల్లింపుకు సంబంధించిన వివరాలు పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. బంటుమిల్లి మండలం ముల్లపర్రు ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వెళ్లే ఉపాధ్యాయులకు ఎన్వోసీ మంజూరు లో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెఎ ఉమామహేశ్వరరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండి షౌకత్ హుస్సేన్, బి. కనకారావు, జిల్లా గౌరవాధ్యక్షులు జె. లెనిన్ బాబు, జిల్లా కార్యదర్శులు సిహెచ్ రాజా శ్రీధర్, కె రంగనాథ్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు జె ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)