నేటి నుండి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు
అందరికీ ఉచిత దర్శనాలే
అదనపు ఆకర్షణగా జాతీయ సరస్, విజయవాడ ఉత్సవ్
ప్రజాశక్తి - ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యాన ఆదివారం నుండి ప్రారంభమయ్యే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే నవరాత్రి ఉత్సవాలకు సుమారు 25 లక్షల మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా చేశారు. రోజుకు సగటున 2.5 లక్షల మంది చొప్పున వచ్చే రద్దీకి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరలివస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది రూ.100, రూ.300, రూ.500 దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేసి అందరికీ ఉచిత దర్శనాలకు అనుమతించారు. కేవలం రూ.1000 శీఘ్రదర్శనం టికెట్ మాత్రమే అందుబాటులో ఉంచారు. విఐపిలు, ప్రోటోకాల్ ప్రముఖులకు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే అంతరాలయ దర్శనానికి అనుమతించనున్నారు. యాత్రికుల సౌకర్యార్థం బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. దుర్గాఘాట్, సీతమ్మవారి పాదాలు వద్ద యాత్రికుల కోసం జల్లు స్నానాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 3,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శన సమయాలు, పార్కింగ్, ప్రసాదం కౌంటర్ల వివరాలతో కూడిన ‘దసరా 2026’ మొబైల్ యాప్‌ను కూడా అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.
దుర్గమ్మ నవరాత్రులతో పాటు కృష్ణా నది ఒడ్డున పున్నమి ఘాట్ వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 31 వరకు జాతీయ స్థాయి ‘సరస్ అజీవిక మేళా’ నిర్వహించనున్నారు. ఈ మేళాలో దేశవ్యాప్తంగా ఉన్న మహిళా హస్తకళాకారులు, కళాకారుల కోసం దాదాపు 600 పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ ఆహార పదార్థాలు (దేశీయ రుచులు), చేతితో తయారుచేసిన కళాఖండాలు, చేనేత వస్త్రాలు ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు. భవానీపురంలోని పున్నమి ఘాట్, సింగ్‌నగర్‌లోని ఎంబి స్టేడియంలో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు, లైవ్ మ్యూజిక్ బ్యాండ్స్, సెలబ్రిటీల ప్రదర్శనలు ఉంటాయి. క్రాకర్స్ షో, డ్రోన్ షో నిర్వహించనున్నారు. రెండు వేదికలలో కలిపి మొత్తం 115 షాపింగ్ స్టాళ్లు, 35 ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారు.






కామెంట్‌లు (0)