శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆంక్షలతో సమస్య పరిష్కారం కాదు..అవగాహన కల్పించడం ముఖ్యం

1 గంట క్రితం

delhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 10:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : దీపావళి వేడుకలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. కేవలం ఆంక్షలు విధించడం వల్లే కాలుష్య సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేసింది. పండుగల సమయంలో పాటించే ఆచారాలు, పద్ధతులను కూడా పరిశీలించాలని సూచించింది. ఢిల్లీ వాయు కాలుష్యంపై సుమోటోగా విచారణ జరుపుతున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. కాలుష్య సంక్షోభానికి ఆర్థికంగా వెనుకబడిన తరగతులను నిందించవద్దని హెచ్చరించింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వాయు కాలుష్యానికి వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలే ప్రధాన కారణమని సుప్రీంకోర్టు పేర్కొంది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీని గాజియాబాద్, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్ వంటి ప్రాంతాలతో కలిపే రహదారులపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోందని ధర్మాసనం ప్రస్తావించింది. రోడ్లపై తిరుగుతున్న వాహనాల రకాలను పరిశీలిస్తే కాలుష్యానికి ప్రధాన కారణం అర్థమవుతుందని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ‘మనం మాట్లాడుతూనే ఉంటాం. కొన్నిసార్లు ప్రకటనలు, సూచనలు చేస్తుంటాం. కానీ అసలు విషయం ఏమిటంటే ఎక్యూఐ (వాయు నాణ్యత సూచీ) ఇప్పటికే 400కి చేరువలో ఉంది" అని ఆయన అన్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.

పేదల జీవనోపాధిని పరిగణనలోకి తీసుకోవాలి..

కాలుష్య నియంత్రణ చర్యల విషయంలో ఆర్థికంగా వెనుకబడిన ప్రజల ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. రోడ్లపై ఆధారపడి జీవనోపాధి పొందే పేద ప్రజలే కాలుష్య సమస్యతో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ముఖ్యంగా పండుగల సమయంలోనే అనేకమందికి ఉపాధి లభిస్తుందని గుర్తుచేసింది. అందువల్ల కాలుష్య నియంత్రణ పేరుతో పేదల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా చూడాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే పంట గడ్డిని కాల్చడం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు రైతులకు అవగాహన కల్పించాలని సుప్రీంకోర్టు మరోమారు సూచించింది. పొలాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడానికి బదులుగా యంత్రాలను ఉపయోగించేలా ప్రోత్సహించాలని పేర్కొంది. వాయు నాణ్యత సూచిక (ఎక్యూఐ) నిర్దిష్ట స్థాయికి మించి పెరిగితే అన్ని వయసుల విద్యార్థుల కోసం పాఠశాలలను మూసివేయాలని లేదా హైబ్రిడ్ విధానంలో తరగతులు నిర్వహించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన ధర్మాసనం, నిపుణుల అభిప్రాయాల మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. జస్టిస్ సూర్యకాంత్‌తో పాటు జస్టిస్‌ జయమాల్య బాగ్చీ, జస్టిస్‌ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం వాయు కాలుష్య నియంత్రణ నిబంధనలపై విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం, ఇతర అధికారుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కాలుష్య నియంత్రణకు సంబంధించిన చర్యలను కోర్టుకు వివరించారు.

ఢిల్లీలో 391కు చేరిన ఎక్యూఐ

మరోవైపు, శుక్రవారం ఉదయం జాతీయ రాజధాని దిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించి 'తీవ్ర' కాలుష్య స్థాయికి చేరువైంది. మొత్తం ఏక్యూఐ 391గా నమోదైంది. నగరవ్యాప్తంగా ఉన్న 59 పర్యవేక్షణ కేంద్రాల్లో ఉదయం 9 గంటల సమయానికి 30 కేంద్రాలు 'తీవ్ర' గాలి నాణ్యతను నమోదు చేశాయి. మిగిలిన కేంద్రాల్లో 'చాలా పేలవమైన' గాలి నాణ్యత నమోదైంది. అధికారిక గణాంకాల ప్రకారం రోహిణిలో అత్యధికంగా 475 ఏక్యూఐ నమోదవగా, ఐఐటి ఢిల్లీలో 472గా నమోదైంది. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేశాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్