- ప్రబీర్ పుర్కాయస్థకు సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో నమోదైన మనీ లాండరింగ్ కేసును కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్, దాని ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ నాలుగు వారాల్లోగా తమ స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. తొలుత ఇడి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు అందుబాటులో లేనందున నాలుగు వారాల సమయం కావాలని కోరారు. ఈ వాదన నమ్మదగినదిగా లేదని జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానించారు. అయితే, ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు మే 29న తీర్పు ఇచ్చింది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఇఒడబ్ల్యూ) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను, దానితో ముడిపడి ఉన్న ఇడి మనీ లాండరింగ్ చర్యలను కొట్టివేశారు. ఎఫ్‌ఐఆర్‌ను కొనసాగించడం చట్ట ప్రక్రియను తీవ్రంగా ఉల్లంఘించడమేనని కోర్టు పేర్కొంది. మూల నేరానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కొట్టివేతకు గురైతే, ఇడి దాఖలు చేసిన ఇసిఐఆర్ కూడా మూతబడినట్లేనని స్పష్టం చేసింది.







కామెంట్‌లు (0)