ప్రజాశక్తి - కలెక్టరేట్ (కృష్ణా)
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్‌లో సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, నేర నియంత్రణ, బందోబస్తు నిర్వహణ మరింత వేగవంతం, సమర్థవంతంగా చేపట్టవచ్చని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నూతనంగా నిర్మించిన కృష్ణాజిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను ఆయన గురువారం ప్రారంభించారు. సెంటర్లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సౌకర్యాలను పరిశీలించారు. ప్రారంభోత్సవంలో కలెక్టర్ డీకే బాలాజి, ఏలూరు రేంజ్ ఐజి జివిజి అశోక్ కుమార్, కృష్ణా, ఏలూరు జిల్లాల ఎస్పీలు వి.విద్యాసాగర్ నాయుడు, కే ప్రతాప్ శివ కిషోర్, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు, రాష్ట్ర స్థాయిలో డీజీపీ కార్యాలయంలో కేంద్ర కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇది ఆర్టీజీఎస్ వ్యవస్థకు అనుసంధానమై సమగ్ర నెట్‌వర్క్‌గా పనిచేస్తోందన్నారు. జిల్లాల్లోని సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, పోలీసు సిబ్బంది కదలికలను కమాండ్ సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చన్నారు. శాంతిభద్రతలు, విపత్తులు, కీలక కార్యక్రమాలు, వీఐపీ బందోబస్తు వంటి సందర్భాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన ప్రాంతాలకు పోలీసు బలగాలను తక్షణమే మళ్లించేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతుందన్నారు. ‘త్రినేత్ర’ యాప్‌ను రూపొందించిన కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడును ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికల బందోబస్తులో విజయవంతంగా వినియోగించిన ఈ యాప్ ద్వారా పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారా, నిర్దేశిత ప్రాంతాలను సందర్శించారా, వారి కదలికలు ఎలా ఉన్నాయనే అంశాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించవచ్చన్నారు. ఎన్నికలను ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ప్రశాంతంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు పోలీసు సిబ్బందిని అభినందించారు. కమాండ్ సెంటర్ నిర్వహణలో మహిళా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సాంకేతికంగా నైపుణ్యం కల్పించడం అభినందనీయమన్నారు. సైబర్ నేరాలు, సాంకేతిక ఆధారిత నేరాల దర్యాప్తు కోసం ప్రతి జిల్లాలో 20 మంది సభ్యులతో ప్రత్యేక ‘క్లిక్’ బృందాలను ఏర్పాటు చేశామని, వారికి ప్రత్యేక శిక్షణ, ధృవీకరణ కోర్సులు అందించామని తెలిపారు. ఈ బృందాలు జిల్లా కేంద్రం నుంచే పోలీస్ స్టేషన్లకు సాంకేతిక సహకారం, నిపుణుల సలహాలు అందిస్తూ సైబర్ నేరాలపై వేగంగా దర్యాప్తు చేపట్టేందుకు సహాయపడతాయన్నారు. నేర పరిశోధనలో కృత్రిమ మేధస్సు (ఏఐ), ఫోరెన్సిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడంపై పోలీసు శాఖ దృష్టి సారించిందన్నారు. ప్రతి సబ్ డివిజన్‌కు క్లూస్ టీమ్ వాహనాన్ని ఏర్పాటు చేశామని, నేరస్థలాల్లో ఆధారాలు సేకరించి వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా స్థాయిలో 15 రకాల ఫోరెన్సిక్ కిట్లతో కూడిన ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చి, జీపీఎస్ ద్వారా కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌తో అనుసంధానించామని తెలిపారు. నూతన క్రిమినల్ చట్టాల అమలులో రాష్ట్రంలో కన్విక్షన్ రేటు 86 శాతానికి చేరడం పోలీసు శాఖ సాధించిన మంచి ఫలితమన్నారు. తొలుత కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కమాండ్ సెంటర్ పనితీరును స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. జిల్లాలోని సీసీ కెమెరాలు, డ్రోన్లు, పోలీసు బీట్ వ్యవస్థ, బాడీ వార్న్ కెమెరాలు, బీట్ వాహనాలు, ఆసుపత్రులు, ట్రామా కేర్ సెంటర్లు, పోలీస్ స్టేషన్ల వివరాలను డిజిటల్ మ్యాప్‌లో అనుసంధానించినట్లు తెలిపారు. ఒకేసారి 30 డ్రోన్ల వరకు ప్రత్యక్ష పర్యవేక్షణ చేసే సామర్థ్యం ఉందన్నారు. వీఐపీ బందోబస్తు, భారీ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కెమెరాలను సమకూర్చుకుని, వాటిని నేరుగా కమాండ్ సెంటర్‌కు అనుసంధానించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.త్రినేత్ర యాప్ ద్వారా పోలీసు బలగాల రూట్లు, విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలు, వారి ఫోన్ నంబర్లు, సున్నితమైన ప్రాంతాల సందర్శనల సంఖ్య, బందోబస్తు కవరేజీ, పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ వంటి అంశాలను సమగ్రంగా తెలుసుకోవచ్చన్నారు. సిబ్బంది నిర్దేశిత ప్రాంతం నుంచి దూరంగా వెళ్లడం, విధుల్లో నిష్క్రియంగా ఉండడం, యాప్ ఆఫ్‌లైన్ కావడం వంటి అంశాలను గుర్తించి అలర్ట్‌లు పొందవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్ బటన్ ద్వారా సమాచారం అందుకుని సమీప బలగాలను వెంటనే సంఘటనా స్థలానికి పంపేందుకు వీలుంటుందన్నారు. పోలింగ్ శాతం, ప్రాంతాల వారీ ఓటర్ల వివరాలు, బందోబస్తు సిబ్బంది సందర్శనల నివేదికలు కూడా ఆటోమేటిక్‌గా రూపొందుతాయని వివరించారు. కమాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక స్క్రీన్ వ్యవస్థ ద్వారా ఒకేసారి 36 స్క్రీన్ల వరకు వివిధ ప్రాంతాల ప్రత్యక్ష దృశ్యాలను వీక్షించవచ్చని, తక్కువ లేటెన్సీతో సమాచార ప్రసారం కోసం ప్రత్యేక లీజ్డ్ లైన్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఏఐ టూల్స్, సాంకేతిక వ్యవస్థలను దశలవారీగా కమాండ్ సెంటర్‌కు అనుసంధానించి నేర గుర్తింపు, దర్యాప్తు, ప్రజల భద్రతను మరింత మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వివి నాయుడు, మచిలీపట్నం, అవనిగడ్డ, గన్నవరం డీఎస్పీలు ఏ శ్రీనివాసరావు, అభిషేక్, పి శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
.








కామెంట్లు (0)