పత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ఎన్నికల వేళ అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
పెద్దకడబూరు (కర్నూలు) : పెద్దకడబూరు మండలంలోని,20 పంచాయతీలో జరుగుతున్న సర్పంచి ఎన్నికలు సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీస్ సిబ్బంది. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పెద్దకడబూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాలవాడి గ్రామంలో ఆదివారం భారీ స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. కోసిగి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి.ఏ. మంజునాథ్ ఆధ్వర్యంలో కోసిగి ఎస్ఐ. రమేష్‌రెడ్డి, పెద్దకడబూరు ఎస్ఐ. ఈ. మారుతి, పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ. బిఏ. మంజునాథ్, మాట్లాడుతూ... గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధులు, అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వాహనదారులను ఆపి ద్విచక్ర వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఇతర ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి వివరాలను సేకరించి తదుపరి పరిశీలన చేపట్టారు. పోలీసుల ఆకస్మిక తనిఖీలతో గ్రామంలో కొంతసేపు సందడి నెలకొంది.*ఎన్నికల వేళ అప్రమత్తం..*అనంతరం గ్రామస్థులతో పోలీసులు సమావేశమై రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు మద్దతుగా నిలిచే క్రమంలో ఎవరూ గొడవలు, ఘర్షణలు, అల్లర్లకు పాల్పడరాదని సూచించారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత కక్షలుగా మార్చుకుని గ్రామంలో అశాంతి సృష్టిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.ఎవరైనా ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)