- భారీగా పడిపోయిన దిగుబడి
- ధర తగ్గించేస్తున్న దళారులు
- తీవ్రంగా నష్టపోతున్న రైతులు
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : ఎల్‌నినో, తుపానుకు తోడు ఉల్లి పంటకు తెగుళ్లు ఆశించడంతో దిగుబడి భారీగా పడిపోయింది. ధర తగ్గించేసి దళారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రైతులు కష్టపడి ఉల్లిని పండించారు. రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో ఉల్లి అత్యధికంగా సాగవుతోంది. ఈ సంవత్సరం వర్షాలు పడకపోవడంతో సాగు భారీగా తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లాలో 60 వేల ఎకరాల సాధారణ సాగుకుగానూ ఈ ఏడాది 17,500 ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ బోర్ల కింద పంటలు సాగు చేశారు. విత్తనం విత్తినప్పటి నుంచి కోత కోసి మార్కెట్‌కు తరలించే వరకూ ఎకరాకు రూ.లక్ష వరకూ పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. వర్షాధారంగా వేసిన పంట పూర్తిగా ఎండిపోయింది. బోరు బావుల కింద సాగు చేసిన ఉల్లి పంటను మాత్రమే ప్రస్తుతం కర్నూలు మార్కెట్‌కు అమ్మకానికి తీసుకొస్తున్నారు. సాగు చేసిన ఉల్లి పంటను నాలుగు నెలల పాటు రైతులు కాపాడుకుంటూ వచ్చారు. ఎల్‌నినో, తుపాన్ ప్రభావంతో పాటు తెగుళ్లతో ఉల్లి పంట దెబ్బతిని దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 40 క్వింటాళ్ల వరకూ దిగుబడి రావాల్సి ఉండగా ఐదు నుంచి పది క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది. వచ్చిన కొద్దిపాటి పంటను మార్కెట్‌కు తెస్తే దళారులు ముంచేస్తున్నారు. సెప్టెంబరులో ఉల్లి క్వింటా గరిష్ట ధర రూ.4,500 నుంచి రూ.5,510 వరకూ పలికింది. అక్టోబరులో రూ.4,300 నుంచి రూ.4,800 మధ్య ఉంది. ప్రస్తుతం రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేలకే దళారులు ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌కు తెచ్చినా సరైన ధర రాకపోవడంతో చాలా మంది రైతులు పొలాల్లోనే ఉల్లిని దున్నేస్తున్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోనే వంద ఎకరాలకు పైగా ఉల్లి పంటను రైతులు దున్నేశారు. ప్రభుత్వం పరిహారమందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
తూకాల్లోనూ మోసాలు...
మార్కెట్లో ఉల్లి తూకాలు జరిగే సమయంలో మార్కెట్ కమిటీ అధికారులు అటువైపు చూడటం లేదు. లైసెన్సు కలిగిన కాటాదారులు మాత్రమే తూకం వేయాలి. ఇది అమలు జరగడం లేదు. ఈ క్రమంలో తూకాల్లో మోసాలు జరుగుతున్నాయి. రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా పట్టించుకునే వారే కరువయ్యారు.
లక్షల్లో నష్టం... ప్రభుత్వం ఆదుకోవాలి
ఐదెకరాల్లో పెద్దబళ్లారి ఉల్లి సాగు చేశాను. ఎకరాకు రూ.45 వేల చొప్పున రూ.2.25 లక్షలు ఖర్చు చేశా. తెగుళ్లతో పంట దెబ్బతింది. 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా రూ.2,400 చొప్పున విక్రయించా. మొత్తంగా రూ.60 వేలు మాత్రమే వచ్చింది. లక్షన్నరకు పైగా నష్టపోయా. మరో ఐదెకరాల్లో చిన్న బళ్లారి ఉల్లి సాగు చేశా. అది కూడా తెగుళ్లు సోకి దెబ్బతింది. ప్రత్యామ్నాయ పంట సాగు చేసేందుకు ఉల్లిపంటను దున్నేస్తున్నాను. ప్రభుత్వమే ఆదుకోవాలి.
- సహదేవరెడ్డి, కొలుములపేట, చాగలమర్రి మండలం








కామెంట్‌లు (0)