సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆలయ భూముల్లో అర్ధరాత్రి మట్టి తవ్వకాలు !

1 గంట క్రితం

Soil excavation on temple lands at midnight!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 12:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రాత్రివేళ ట్రాక్టర్లతో తరలింపు.. భారీ గుంతలు

- రోడ్డుకు వినియోగిస్తున్న మట్టి

- అధికారులకు తెలియజేసినా చర్యలు శూన్యం.

- అనుమతులు లేకుంటే బిల్లులు నిలిపివేస్తామన్న పీఆర్‌ ఏఈ.

- అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని గ్రామస్తుల ఆరోపణ.


ప్రజాశక్తి-తర్లుపాడు (ప్రకాశం) : ఆలయ భూముల్లో అర్ధరాత్రి వేళల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయంటూ సీతానాగులవరం గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయాల్లో ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారని, కొంత మట్టిని రూ. 5 లక్షలు జడ్పీ నిధులతో నిర్మిస్తున్న గ్రావెల్‌ రోడ్డుకు వినియోగిస్తున్నారని చెబుతున్నారు. మరికొంత మట్టిని మార్కాపురం పరిసర ప్రాంతాల్లోని వెంచర్లకు తరలిస్తున్నారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.


గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 58/3లో ఉన్న శ్రీశ్రీశ్రీ రాములవారి మాన్యానికి చెందిన భూమిలో కొంతకాలంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. అనుమతులు లేకుండా రాత్రివేళల్లో తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలిస్తున్నారని ఆరోపించారు. గురు, శుక్రవారాల్లో అర్ధరాత్రి సమయంలో తవ్వకాలు జరుగుతున్న విషయాన్ని వీఆర్వో, తహసీల్దార్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.


భారీ గుంతలు.. ప్రమాదం పొంచి ఉందని ఆందోళన

మట్టి తవ్వకాలతో ఆలయ భూముల్లో భారీ గుంతలు ఏర్పడ్డాయని గ్రామస్థులు చెబుతున్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరితే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు ప్రమాదవశాత్తు గుంతల్లో పడే అవకాశం ఉందని, అధికారులు వెంటనే స్పందించి తవ్వకాలను నిలిపివేయాలని కోరుతున్నారు.


ట్రాక్టర్‌ మట్టికి డిమాండ్‌

మొరస మట్టికి మార్కెట్లో డిమాండ్‌ ఉండటంతో ట్రాక్టర్‌ మట్టి సుమారు రూ.1,200 నుంచి రూ.1,500 వరకు ధర పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో మట్టి తవ్వకాలు వ్యాపారంగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కాపురం సమీపంలో ఉండటంతో మట్టిని పట్టణ పరిసరాల్లోని వెంచర్లకు తరలిస్తున్నారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

prakasam

మామూళ్ల మత్తులో అధికారులు.

సీతా నాగులవరం రాములవారి మాన్యంలో గురు, శుక్రవారం రాత్రి వేళలో మట్టి త్రవ్వకాలు చేపట్టి రవాణా చేస్తున్నారని తెలిపిన పట్టించుకోకపోగా, శనివారం రాత్రి కూడా మట్టి తవ్వకాలు, రవాణా జరుగుతున్న విషయాన్ని వీఆర్వో, తహసీల్దార్‌, స్థానిక ఎస్సై దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. వాహనాలను సీజ్‌ చేసి తవ్వకాలను అడ్డుకుంటామని అధికారులు చెప్పినప్పటికీ, తాము మళ్లీ ఫోన్‌ చేసిన సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని గ్రామస్తులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే తవ్వకాలు కొనసాగుతున్నాయని కొందరు గ్రామస్థులు తెలియజేస్తున్నారు.అధికారులు అక్రమ తవ్వకాలను అడ్డుకోకుండా మౌనం వహించడంపై ముడుపులు తీసుకున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని కోరుతున్నారు.


కలెక్టరుకు ఫిర్యాదు చేస్తాం

అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా తగిన చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఆలయ భూముల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. రాత్రివేళల్లో తవ్వకాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అనుమతులు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


అనుమతులు లేకుంటే బిల్లు నిలిపివేత

“సీతానాగులవరంలో జడ్పీ నిధులతో మంజూరైన గ్రావెల్‌ రోడ్డుకు రాములవారి మాన్యం నుంచి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. రోడ్డుకు మట్టి చదును చేసే పనిని జేసీబీతో నిర్వహించే విషయాన్ని మాత్రమే పర్యవేక్షించాను. అనుమతులు లేకుండా మట్టి తరలించినట్లు తేలితే కాంట్రాక్టర్‌ బిల్లును నిలిపివేస్తాం” అని పీఆర్‌ ఏఈ మహంకాళయ్య తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్