శ్రీశైలం: ముదిరాజ్ (కోలి) కుల బంధువుల చిరకాల ఆకాంక్షతో 1991లో ప్రారంభమైన శ్రీశ్రీశ్రీ పురూరవ వంశ ముదిరాజ్ (కోలి) నిత్య అన్నదాన సమాజం సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు వేసింది. శ్రీశైలానికి వచ్చే భక్తులు, యాత్రికులకు మరిన్ని వసతి సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో నూతనంగా 16 గదుల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించింది.
ప్రస్తుతం సమాజం ఆధ్వర్యంలో 73 గదులు, కల్యాణ మండపం, విశాలమైన భోజనశాల ద్వారా భక్తులకు వసతి కల్పించడంతో పాటు ప్రతిరోజూ రెండుపూటలా నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు. నూతన గదుల నిర్మాణం పూర్తయితే మొత్తం గదుల సంఖ్య 89కు చేరుకోనుంది.
ఈ సందర్భంగా సమాజం అధ్యక్షుడు రోటం భూపతి మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కుల బంధువులు, దాతల సహకారంతో భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. అదనపు గదులతో పాటు డార్మెటరీ, ఆధునిక కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం చేపడుతున్నామని, వచ్చే ఉగాది నాటికి వీటిని భక్తులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఉపాధ్యక్షుడు పోతురాజు పెద్ద వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 1991లో నాటిన సేవా బీజం నేడు మహావృక్షంగా ఎదిగి వేలాదిమంది భక్తులకు సేవలందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు, కుల పెద్దలు, యువత, మహిళలకు సమాజం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు మడబోయిన గురు ప్రసాద్ సమాజం కమిటీ సభ్యులు, కుల పెద్దలు, దాతలు, ప్రత్యేక ఆహ్వానితులు, కుల బంధువులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.








కామెంట్లు (0)