రూ.21.31 కోట్ల రుణాల పంపిణీ చేసిన కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం: రైతులకు ఖరీఫ్ సీజన్లో పంట రుణాలు అందించడం ద్వారా వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. గురువారం మైలవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ నెట్టెం రఘురాంతో కలిసి రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ .. మొత్తం రూ.21.31 కోట్ల రుణాలు పంపిణీ చేయగా, అందులో మైలవరం బ్రాంచ్‌కు రూ.11.93 కోట్లు, జి.కొండూరు బ్రాంచ్‌కు రూ.4.51 కోట్లు, ఇబ్రహీంపట్నం బ్రాంచ్‌కు రూ.3.50 కోట్లు, కొత్తూరు తాడేపల్లి బ్రాంచ్‌కు రూ.0.62 కోట్లు, భవానిపురం బ్రాంచ్‌కు రూ.0.75 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రైతులు సకాలంలో రుణాలను వినియోగించి వ్యవసాయోత్పత్తిని పెంచుకోవాలని, మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని తెలిపారు. సహకార రంగం బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రైతులు మరియు మహిళలకు అవసరమైన ప్రతి విధమైన సహకారం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
మైలవరం నియోజకవర్గ పరిధిలోని 5 బ్రాంచీల ద్వారా మొత్తం 28 సొసైటీలకు రుణాలు మంజూరు చేశారు. వీటిలో 27 సంఘాలు లాభాల్లో ఉన్నాయి. మైలవరం నియోజకవర్గ పరిధిలోని కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) వివిధ బ్రాంచీలలో 2026 మే 31 నాటికి మొత్తం రూ.319.59 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం బ్రాంచ్‌లో రూ.100.39 కోట్ల డిపాజిట్లు, మైలవరం బ్రాంచ్‌లో రూ.85.62 కోట్లు, జి.కొండూరు బ్రాంచ్‌లో రూ.67.52 కోట్లు, భవానీపురం బ్రాంచ్‌లో రూ.50.96 కోట్లు డిపాజిట్లు, కొత్తూరు తాడేపల్లి బ్రాంచ్‌లో రూ.15.10 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. మైలవరం నియోజకవర్గంలోని ఐదు ప్రధాన బ్రాంచీల ద్వారా మొత్తం రూ.723.25 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. ఇందులో మైలవరం బ్రాంచ్ రూ.249.04 కోట్ల రుణాలు, జి.కొండూరు బ్రాంచ్ రూ.236.14 కోట్లు, ఇబ్రహీంపట్నం బ్రాంచ్ ద్వారా రూ.156.16 కోట్లు, కొత్తూరు తాడేపల్లి బ్రాంచ్ ద్వారా రూ.46.96 కోట్లు, భవానిపురం బ్రాంచ్ ద్వారా రూ.34.95 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం గారు మాట్లాడుతూ మే 31, 2026 నాటికి కేడీసీసీబీ ద్వారా జిల్లాలో మొత్తం రూ.12,596.92 కోట్లు రుణాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అందులో డిపాజిట్లు రూ.3,981.13 కోట్లు కాగా, రూ.8,615.78 లక్షల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు (గాంధీ), సహకార శాఖ అధికారులు, బ్యాంకు ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, రైతులు, డ్వాక్రా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)