ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

78వ డివిజన్‌లో సిపిఎం ఆత్మీయ సమావేశం

5 రోజుల క్రితం

CPM informal meeting in the 78th division
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 10:49 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 78వ డివిజన్‌లో సిపిఎం అభ్యర్థికి ఓటు వేసి, ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రజలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యలు సీహెచ్ బాబూరావు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో 78వ డివిజన్ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం నగర కమిటీ సభ్యులు కే. నిజాముద్దీన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిహెచ్. బాబూరావు మాట్లాడుతూ... విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులకు ఓట్లు వేసి ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, సానుభూతిపరులందరినీ అభినందించారు. ఎన్నికల్లో గెలిచిన కూటమి పార్టీకి చెందిన కార్పొరేటర్లు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత గెలిచిన ప్రజాప్రతినిధులపై ఉందని స్పష్టం చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలతో ఓట్లను కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను విస్మరిస్తే ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా ఉండాలి తప్ప, ధనబలం, అధికారబలం ప్రదర్శించే వేదికగా మారకూడదన్నారు. ఎన్నికల పోరాటంలో అధికార దుర్వినియోగం, అక్రమాలు, దౌర్జన్యాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. సీపీఎం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసే పార్టీ అని అన్నారు. పదవులు, అధికారం కోసం కాకుండా ప్రజల హక్కులు, సమస్యల పరిష్కారం, సామాన్య ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కమ్యూనిస్టులు పనిచేస్తారని తెలిపారు. సింగ్‌నగర్‌తో పాటు 78వ డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుధ్య సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, దోమల బెడద, తాగునీటి సమస్య, అంతర్గత రహదారులు, వీధి దీపాలు, పెరిగిన ఇంటి పన్నులు, విద్యుత్ ఛార్జీలు తదితర సమస్యల పరిష్కారం కోసం సీపీఎం నిరంతరం ప్రజలతో కలిసి పోరాడుతుందని ప్రకటించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై, ఎన్నికైన ప్రజాప్రతినిధుల పనితీరుపై పార్టీ నిరంతరం నిఘా ఉంచుతుందని తెలిపారు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అవసరమైతే ప్రజలను సమీకరించి ఆందోళనలు నిర్వహిస్తామని అన్నారు. డివిజన్ అభివృద్ధి కోసం ప్రజలందరినీ కలుపుకొని ఐక్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. రానున్న రోజుల్లో 78వ డివిజన్‌లో ప్రజా సమస్యలపై నిరంతర కార్యాచరణ రూపొందించి, ప్రజా ఉద్యమాలను బలోపేతం చేస్తామని తెలిపారు. సీపీఎం చేపట్టే ప్రజా పోరాటాలకు ప్రజలందరూ మద్దతుగా నిలిచి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి. రమణ, సిపిఎం నగర కమిటీ సభ్యులు ఏం సోమేశ్వరరావు, చింతల శీను, డివిజన్ నాయకులు పాత్రుడు, రాజేష్, లింగరాజు, పిఎస్ఎన్ మూర్తి, మహిళా సంఘం నాయకులు విజయలక్ష్మి, చంద్రమణి, సిపిఐ నాయకులు గురవయ్య, ఎన్నికల్లో పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్