22వ డివిజన్‌లో వెంటనే అండర్‌పాస్ నిర్మించాలని డిమాండ్
ప్రజాశక్తి - ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి: కృష్ణలంక 22వ డివిజన్‌లో జాతీయ రహదారిపై అండర్‌పాస్ (సబ్‌వే) నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులు ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, విజయవాడ తూర్పు కార్యదర్శి పి.కృష్ణ మాట్లాడుతూ.. విజయవాడలో తొలుత ఏర్పడిన ప్రాంతాల్లో కృష్ణలంక ఒకటని, అయినప్పటికీ నేటికీ అభివృద్ధికి దూరంగా ఉండటం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వాలు, నాయకులు మారుతున్నా కృష్ణలంకలో మాత్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదన్నారు. 2017లో నూతన రహదారి నిర్మాణ సమయంలోనే ప్రస్తుత 21, 22 డివిజన్లతోపాటు రాణిగారి తోట సమీపంలో సబ్‌వే నిర్మించాలని పోరాటం చేసినప్పటికీ ఒక్క సబ్‌వే మాత్రమే నిర్మించారని తెలిపారు. ప్రస్తుతం మూడు డివిజన్లకు ఒకే సబ్‌వే ఉండటంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రజలకు సబ్‌వే దూరంగా ఉండటం మరో సమస్యగా మారిందని పేర్కొన్నారు. కృష్ణలంకలో 1,150 ఇళ్లకు గత ప్రభుత్వం జీఓ జారీ చేసినప్పటికీ కొందరు కోర్టులో కేసు వేయడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఈ సమస్యను పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం కోసం తామెందుకు పోరాడాలన్న ధోరణి ప్రభుత్వంలో కనిపించడం సరికాదన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కృష్ణలంక ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, 22వ డివిజన్‌లో వెంటనే సబ్‌వే నిర్మించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు బత్తుల చిన్నారావు, కోరాడ రమణ, స్థానిక నాయకులు తాతా సాంబయ్య, కాయల లక్ష్మణ్, వాజా శ్రీనివాసరావు, టి.తాండవ కృష్ణ, తవిటమ్మ, గోకా సూర్యనారాయణ, బి.ఉమామహేశ్వరరావు, కొప్పిశెట్టి శ్రీనివాస్, నాగూర్ తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)