సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

673 జీవోను తక్షణమే రద్దు చేయాలి : జీవో వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్

11 సెప్టెంబర్, 2026

GO 673 must be revoked immediately: Anti-GO Struggle Committee demands.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 02:50 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజా సౌకర్యాలన్నీ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి పోతాయి...


ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : 673 జీవోను అమలుచేస్తే ప్రజా సౌకర్యాలన్నీ పూర్తిగా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తాయని 673 జీవో వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ యు.వి.కృష్ణయ్య అన్నారు. విజయవాడ బాలోత్సవ్ భవన్‌‌లో శుక్రవారం 673 జీ.వో. వ్యతిరేక పోరాట కమిటీ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని మున్సిపల్ సేవలను, ఆస్తులను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్.టీ నెంబర్ 673ను తక్షణమే రద్దు చేయాలని 673 జీవో వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేశారు. ఈ జీవో అమలులోకి వస్తే విజయవాడ నగరంలోని మున్సిపల్ నీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి పారుదల, మున్సిపల్ రోడ్లు, సిటీ బస్సులు, పార్కులు, మార్కెట్లు, రైతు బజార్లు, పబ్లిక్ టాయిలెట్ల వంటి ప్రజా సౌకర్యాలన్నీ పూర్తిగా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తాయని కమిటీ ఆందోళన వ్యక్తం చేశారు. మానిటైజేషన్ పేరుతో ఖాళీ భూములు, ఎన్.టి.ఆర్. కాంప్లెక్సు, వస్త్రలత, ఐజిఎం స్టేడియం కాంప్లెక్సు, మున్సిపల్ బస్ స్టాండ్లు, కార్యాలయ భవనాలు, ఆడిటోరియంలను పూర్తిగా అమ్మడం లేదా లీజుకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే పన్నులు చెల్లిస్తున్న నగర ప్రజలు, ఈ జీవో అమలుచేస్తే సేవల కోసం ప్రైవేటు సంస్థలకు అదనంగా యూజర్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల నుండి వసూలు చేసే పన్నులు, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఈ పిపిపి ప్రాజెక్టులకే మళ్ళిస్తారని, ఒకవేళ ప్రైవేటు సంస్థలకు నష్టం వస్తే ప్రభుత్వం ఖజానా నుండి 'వయబులిటీ గ్యాప్ ఫండింగ్' పేరుతో నష్టపరిహారం చెల్లిస్తుందని వివరించారు. ఆస్తులు, సేవలన్నీ ప్రైవేటు పరమైతే కార్పొరేషన్‌కు కేవలం పన్నులు వసూలు చేసి కంపెనీలకు అప్పగించే పని తప్ప మరేమీ మిగలదని, దీనివల్ల మున్సిపల్ ఎన్నికలు జరపడం వృధా ప్రయాస అవుతుందని, మున్సిపల్ కార్పొరేషన్ తన అస్థిత్వాన్ని కోల్పోతుందని హెచ్చరించారు. నగరంలో బ్రిటీష్ పాలన తరహాలో కంపెనీల పాలన మొదలవుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ జీవో అమలు కోసం ప్రభుత్వం వేసిన రెండు కమిటీలలో కేవలం అధికారులే ఉన్నారని, ఎన్నికైన ప్రజా ప్రతినిధి ఒక్కరు కూడా లేకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని కమిటీ స్పష్టం చేశారు. ప్రజలను తాము ఎన్నుకున్న కౌన్సిల్‌ను కాదని, ప్రైవేటు సంస్థల దయాదాక్షిణ్యాలకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. ప్రజాస్వామ్య వ్యతిరేకమైన ఈ జీవోను రద్దు చేసేందుకు విజయవాడ నగరంలోని ముగ్గురు శాసనసభ్యులు (ఎంఎల్ఎలు) తక్షణమే స్పందించి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వి.సాంబి రెడ్డి, ఎ. పున్నారావు, చంద్ర శేఖర్, ఎం.వి.ఆంజనేయులు, వి.ఎస్ . రామరాజు​ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్