ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ నివాళి
ఉమ్మడిగా సోషలిస్టు లక్ష్యాలను చేరుకుంటామని ప్రకటన
బీజింగ్: ఉత్తర కొరియా (డిపిఆర్‌కె) అగ్రనేత కిమ్ జోంగ్ ఉన్ చైనాలో పర్యటించారు. ఈ సందర్బంగా కిమ్ మాట్లాడుతూ అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా కొరియా యుద్ధంలో చైనా సైనికులు చేసిన త్యాగం మరువలేనిదని అన్నారు. శనివారం ఈశాన్య చైనాలోని లియావోనింగ్ ప్రావిన్స్‌కు చెందిన సరిహద్దు నగరం డాండాంగ్‌లో కిమ్ పర్యటించారు. ఈ సందర్భంగా కిమ్, షీ జిన్‌పింగ్‌కు తన ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ కేంద్ర కమిటీ ఐదో ప్లీనరీ సమావేశం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కీలకమైన చారిత్రక సందర్భంలో ఉత్తర కొరియాకు మద్దతుగా ప్రాణత్యాగం చేసిన చైనా పీపుల్స్ వాలంటీర్ల అమరులకు నివాళులర్పించేందుకు, ఆ వీరుల పట్ల తమ దేశ హృదయపూర్వక కృతజ్ఞతను, శాశ్వత గౌరవాన్ని తెలియజేసేందుకే డాండాంగ్ వచ్చానని కిమ్ చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో షీ జిన్‌పింగ్ ఉత్తర కొరియాలో చేసిన చారిత్రక పర్యటన, ఇరు దేశాల సంబంధాలకు ఉన్న అత్యంత ప్రాధాన్యాన్ని చాటిందని, ద్వైపాక్షిక బంధంలో అది మైలురాయి అని అన్నారు. ఇరు దేశాల మధ్య సహకారానికి అవకాశాలు చాలా విస్తృతంగా ఉన్నాయని పేర్కొన్నారు. షీ జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా ప్రజలు సాధించిన విశేష అభివృద్ధిని, అంతర్జాతీయంగా చైనాకు దక్కిన ప్రాధాన్యాన్ని ఉత్తర కొరియా ప్రశంసిస్తోందని కిమ్ అన్నారు. చారిత్రక స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, ఆచరణాత్మక సహకారాన్ని విస్తరించేందుకు, ఇరు దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూర్చేందుకు చైనాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చైనా రాజకీయ సలహా మండలి (సిపిపిసిసి) జాతీయ కమిటీ ఛైర్మన్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు వాంగ్ హునింగ్ ఆయన వెంట ఉన్నారు. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ప్రధాన కార్యదర్శి, ఆ దేశ స్టేట్ అఫైర్స్ అధ్యక్షుడైన కిమ్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తరఫున ఆత్మీయ శుభాకాంక్షలను వాంగ్ తెలియజేశారు. శనివారం ఉదయం ‘‘అమెరికా దురాక్రమణను ఎదిరించి, కొరియాకు సాయం చేసిన యుద్ధ స్మారక భవనం’’ ప్రాంగణంలో కిమ్‌కు వాంగ్ స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరులకు నివాళులర్పించారు.
ఉమ్మడి సోషలిస్టు లక్ష్యాలు బలోపేతం: వాంగ్
ఈ సందర్భంగా వాంగ్ మాట్లాడుతూ, ఇరు దేశాలు స్నేహాం, పరస్పర సహకారంతో ఉమ్మడిగా సోషలిస్టు లక్ష్యాలను చేరుకుంటామని స్పష్టం చేశారు. అమెరికా దురాక్రమణను ప్రతిఘటించి, కొరియా యుద్ధంలో పోరాడేందుకు చైనా పీపుల్స్ వాలంటీర్లు ఉత్తర కొరియాలో అడుగుపెట్టి 76 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కిమ్ ప్రత్యేకంగా డాండాంగ్ రావడం, పోరాటంలో పెనవేసుకున్న చైనా, ఉత్తర కొరియా స్నేహానికి ఆ దేశ పార్టీ, ప్రభుత్వం ఎంత విలువ ఇస్తున్నాయో చాటుతోందన్నారు. ఈ పర్యటన సంప్రదాయ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్తుందని, స్నేహానికి ప్రజల మద్దతును బలోపేతం చేస్తుందని, రాజకీయ పరస్పర విశ్వాసాన్ని పెంచి సహకారం, అభివృద్ధిని ముందుకు నడిపిస్తుందని చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్‌లో, ఈ ఏడాది జూన్‌లో షీ జిన్‌పింగ్, కిమ్ ఒకరి దేశంలో మరొకరు చారిత్రక పర్యటనలు చేసి అనేక కీలక అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చారని, ఇవి ఇరు దేశాల సంబంధాలను కొత్త చారిత్రక దశలోకి తీసుకెళ్లాయని వాంగ్ పేర్కొన్నారు. ఇరు పార్టీల, దేశాల అగ్రనేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని దృఢంగా అమలు చేసేందుకు, ఉమ్మడి సోషలిస్టు లక్ష్యాన్ని బంధంగా చేసుకుని సంబంధాలను మరింత అభివృద్ధి చేసేందుకు చైనా సిద్ధంగా ఉందని తెలిపారు.
యాలు నదిపై నిర్మించిన కొత్త చైనా–ఉత్తర కొరియా వంతెన ప్రారంభాన్ని అవకాశంగా తీసుకుని, ప్రజల రాకపోకలను, వాణిజ్య సహకారాన్ని విస్తరించి ఇరు దేశాల ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చాలని వాంగ్ సూచించారు. సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధిని కాపాడుకునేందుకు శాంతియుత, స్థిరమైన బాహ్య వాతావరణాన్ని సృష్టించేలా వ్యూహాత్మక సంప్రదింపులను, సమన్వయాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వాంగ్, కిమ్ కలిసి డాండాంగ్‌లోని ఒక కార్ల ఫ్యాక్టరీని సందర్శించారు. ఉత్పత్తి విభాగాన్ని పరిశీలించి, అక్కడి అధికారుల వివరణ విన్నారు. కిమ్ డాండాంగ్ నుంచి తిరుగు ప్రయాణమైనప్పుడు, యాలు నదిపై ఉన్న కొత్త వంతెన వద్ద వాంగ్ ఆయనకు వీడ్కోలు పలికారు.








కామెంట్‌లు (0)