ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్హులైన పేదలకు ఇళ్లు, స్థలాలు కేటాయించాలి : 'ఇంటింటికీ సిపిఎం' ఉద్యమానికి పిలుపు

07 ఆగస్టు, 2026

cpim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 01:37 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : విజయవాడ నగరంలోని పేదల ఇళ్లు, నివాస స్థలాలు, మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాశీనాథ్ విమర్శించారు. నగరంలోని శ్రీశ్రీ భవన్‌లో శుక్రవారం జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. నగరంలో పేదల ఇల్లుకోసం అనేకసార్లు సిపిఎం ఇవ్వగా, కలెక్టర్ స్పందించి హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు అర్హులైన పేదలకు ఒక్క ఇల్లు కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ ప్రకారం ప్రతి పేద కుటుంబానికి 2 సెంట్ల ఇళ్ల స్థలం, ఇంటి నిర్మాణానికి ₹5 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులు దాదాపు ₹8 లక్షల వరకు డబ్బులు చెల్లించినప్పటికీ, పూర్తయిన టిడ్కో, జేఎన్ఎన్యుఆర్ఎం ఇళ్లను అప్పగించకుండా ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని, అధికార పార్టీ నేతలు వాటిని తమ అనుయాయులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సిబార్ డిస్నీలాండ్ 50 ఎకరాల స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని, బ్రాహ్మరంభపురంలో 1150 కుటుంబాలకు, వన్‌టౌన్ కొండ ప్రాంతాల్లోని 40 వేల కుటుంబాలకు వెంటనే పట్టాల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రిటైనింగ్ వాల్ పూర్తయిన తర్వాత కూడా పట్టాలు ఇవ్వకుండా, అధికార పార్టీ ప్రజాప్రతినిధి కోర్టులో పిల్ వేసి అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. కృష్ణలంకలో 25 వేల కుటుంబాల సమస్యగా ఉన్న అవుట్‌ఫాల్ డ్రైన్ పనులు, గుణదల ఫ్లైఓవర్, సింగ్ నగర్ రెండో ఫ్లైఓవర్, ఆర్.యు.బి నిర్మాణాలను ప్రభుత్వం ఘోరంగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. అమరావతి రాజధానితో పాటు విజయవాడ నగరాన్ని కూడా అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలని, అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే విధంగా ముఖ్యమంత్రి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు నెల రోజుల పాటు 'ఇంటింటికీ సిపిఎం' ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రజలంతా ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శులు బి. రమణా రావు (సెంట్రల్), బోయి సత్యబాబు (వెస్ట్), పి. కృష్ణ (ఈస్ట్) పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్