మిషన్, రా మెటీరియల్ కొనుగోలు చేస్తే చాలని ప్రకటనలు
ఉభయ రాష్ట్రాల్లో రూ.10-15 కోట్లు వసూలు చేసిన సంస్థ
మూడు నెలలు సవ్యంగా నడిపి బోర్డు తిప్పేసిన వైనం
పోలీస్ స్టేషన్ వద్ద బాధితుల ఆందోళనతో కేసు నమోదు
ప్రజాశక్తి - ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి : ఇంట్లోనే ఉంటూ సులభంగా నెలకు వేల రూపాయలు సంపాదించుకోవచ్చంటూ నమ్మబలికిన ఓ కేటుగాడు వందలాది మంది అమాయక ప్రజల శ్రమను, సొమ్మును దోచుకున్నాడు. పాత్రలు తోమే పీచు (స్క్రబ్బర్) తయారీ, ప్యాకింగ్ బిజినెస్ పేరిట విజయవాడ సత్యనారాయణపురంలో వెలసిన ‘మాషా అల్లాహ్ ఎంటర్ ప్రైజెస్’ రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. కార్యాలయాన్ని మూసివేసి నిర్వాహకులు పారిపోవడంతో మోసపోయామని గ్రహించిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
మాయమాటలతో వల.. మూడు నెలలు డ్రామా!
మధ్యతరగతి మహిళలు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ‘మాషా అల్లాహ్ ఎంటర్‌ప్రైజెస్’కు చెందిన కొందరు సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున ప్రచారం చేశారు. తమ సంస్థ నుండి స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్, రా మెటీరియల్ కొనుగోలు చేసి ప్యాకింగ్ చేసి ఇస్తే చాలని, మార్కెటింగ్ లేకుండా తామే బై-బ్యాక్ (తిరిగి కొనుగోలు) చేసుకుంటామని నమ్మబలికారు. దీని ద్వారా నెలకు రూ.24 వేల నుండి రూ.30 వేల వరకు స్థిర ఆదాయం వస్తుందని ప్రకటనలు గుప్పించారు. ఈ ప్రచారం నిజమని నమ్మిన బాధితులు మిషన్లు, ముడిసరుకు నిమిత్తం ఒక్కొక్కరు రూ.లక్ష నుండి రూ.పది లక్షల వరకు సంస్థ నిర్వాహకులకు చెల్లించారు. నమ్మకం కలిగించడం కోసం మొదటి మూడు నెలలపాటు సక్రమంగానే మెటీరియల్ ఇచ్చి, డబ్బులు చెల్లించారు. అయితే ఆ తర్వాత ముడిసరుకు సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో కార్యాలయం వద్దకు వెళ్లి చూడగా నిర్వాహకుల ఆచూకీ లేకుండా పోయింది. ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో బాధితులంతా కలిసి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. సంస్థ నిర్వాహకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 300 మంది నుండి రూ.పది కోట్ల నుండి రూ.15 కోట్ల వరకు వసూలు చేసి ఉంటుందని అంచనా. అప్పులు చేసి, నగలు తాకట్టు పెట్టి పెట్టుబడులు పెట్టిన తమను నట్టేట ముంచారని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు పసుపులేటి అంకుశం, ఇతర డైరెక్టర్ల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు సత్యనారాయణపురం సిఐ ఎస్.వి.వి.లక్ష్మీనారాయణ తెలిపారు. సుమారు 200 మందికిపైగా బాధితులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.








కామెంట్‌లు (0)