మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకు మహిళల ఘన స్వాగతం
ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : విజయవాడ నగరపాలక సంస్థ (విఎంసి) ఎన్నికల ప్రచారంలో భాగంగా 66వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ (రాధా) నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుండి భారీ స్పందన లభించింది. 66వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మట్ట రవికుమార్‌తో కలిసి బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ప్రచార సమయంలో వర్షం కురుస్తున్నప్పటికీ, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో రోడ్ షోలో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు, యువకులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వంగవీటి రాధాబాబుకు మంగళ హారతులు పడుతూ, పూలమాలలతో కోలాహలంగా స్వాగతం పలికారు. జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణుల నినాదాలతో డివిజన్ పరిధిలోని వీధులన్నీ హోరెత్తాయి. ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ స్థానిక ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. విజయవాడ నగరం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై తాము ప్రత్యేక దృష్టి సారించామని స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడికక్కడ నిలిచిపోతున్న డ్రైనేజీ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, రహదారుల దుస్థితిని త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే విజయవాడను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని ఓటర్లకు భరోసా ఇచ్చారు. కార్పొరేటర్ అభ్యర్థి మట్ట రవికుమార్ మాట్లాడుతూ, 66వ డివిజన్ అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటానని, స్థానిక సమస్యల పరిష్కారమే తన తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఈ రోడ్ షో విజయవంతం కావడంతో కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.








కామెంట్‌లు (0)