మైలవరం (ఎన్టీఆర్ జిల్లా) : ఎన్టీఆర్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్, రాధిక ఛారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో మైలవరంలోని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను కలిసి వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో మొత్తం 24 జట్లు పాల్గొనగా, లీగ్ దశ ముగిసే సమయానికి నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం అందిస్తూ క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని తెలిపారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని, చిన్న వయసు నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రీడా వేదికలను సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు తమలోని ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)