ప్రజాశక్తి-మైలవరం : తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాలైన ఏ.కొండూరు మండలంతో పాటు తిరువూరు, తెలంగాణలోని ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో బుడమేరు ప్రవాహం పెరిగింది. మైలవరం మండలంలోని చిలుకూరు వారి గూడెం బ్రిడ్జి, పుల్లూరు నుంచి జమలాపురం వెళ్లే రహదారిలోని బుడమేరు బ్రిడ్జిలను ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైలవరం–వెల్వడం బైపాస్ రింగ్ వద్ద కూడా బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండేళ్ల క్రితం బుడమేరు వరదల కారణంగా విజయవాడ, మైలవరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు ముంపునకు గురైన నేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితులపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అల్పపీడనం, తుఫాను ప్రభావంతో గురువారం కూడా వర్షాలు కొనసాగుతుండటంతో బుడమేరు ప్రవాహం మరింత పెరుగుతుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.








కామెంట్‌లు (0)