న్యూఢిల్లీ : నీట్- యుజి పేపర్ లీక్ కేసులో నిందితుడైన లాతూర్ కోచింగ్ సెంటర్ యజమాని శివరాజ్ మోటేగాంకర్ కుమారుడు ఆదిత్య మోటేగాంకర్‌పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ ) రెండేళ్ల నిషేధం విధించింది. ఈ ఏడాది నీట్-యుజి పరీక్ష ఫలితాన్ని నిలిపివేయడంతోపాటు, 2027లో జరిగే నీట్-యూజీ పరీక్షకు హాజరుకాకుండా అతడిని అనర్హుడిగా ప్రకటించింది. సెప్టెంబర్ 19న ఎన్‌టీఏ ఉత్తర్వులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో శివరాజ్ మోటేగాంకర్‌ను సిబిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. నీట్-యుజి ప్రశ్నాపత్రం రూపొందించే ఎన్‌టిఎ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్న పి.వి. కులకర్ణి నుండి కెమిస్ట్రీ ప్రశ్నలను పొందేందుకు మోటేగాంకర్ రూ.5 లక్షలు చెల్లించారని సిబిఐ వెల్లడించింది. కులకర్ణి నిర్వహించిన కోచింగ్ తరగతులకు ఆదిత్య హాజరయ్యేవాడని, అక్కడే ఆ ప్రశ్నలను అతడికి అందించారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. మే 3న జరిగిన నీట్-యుజీ పరీక్షకు సంబంధించి అక్రమాల ఆరోపణలు రావడంతో జూన్ 21న ఎన్‌టిఎ పునఃపరీక్ష నిర్వహించింది. అనంతరం ఆదిత్య ఫలితాన్ని నిలిపివేసి, ఆరోపణలపై వివరణ కోరింది. అయితే పరీక్ష సమయంలో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆదిత్య తన సమాధానంలో పేర్కొన్నాడు. మే 3న జరిగిన పరీక్షకు సంబంధించిన అక్రమాలపై తనకు నోటీసు ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత నిర్వహించిన పునఃపరీక్ష ఫలితాన్ని ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించాడు. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 3న నిర్వహించిన నీట్-యుజి పరీక్షను ఎన్‌టిఎ మే 12న రద్దు చేసి, జూన్ 21న పునఃపరీక్ష నిర్వహించింది. ప్రభుత్వ పరీక్షల్లో పేపర్ లీక్‌లు, ఇతర అక్రమ పద్ధతులకు సంబంధించిన కేసులపై సిబిఐ తన తుది నివేదికను గత నెలలో ఢిల్లీలోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు సమర్పించింది.
నీట్-యుజి పేపర్ లీక్ కేసు : మోటేగాంకర్ కుమారుడిపై రెండేళ్ల పాటు నిషేధం
54 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 01:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)