మంగళగిరి రూరల్ (ఆత్మకూరు) : నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూరు గ్రామ సచివాలయం వద్ద సెప్టెంబర్ 28, 29 తేదీల్లో చేపట్టిన రెండు రోజుల రిలే నిరాహార దీక్షలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దీక్షలను ఉద్దేశించి బాబురావు మాట్లాడుతూ... మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి పట్టాలు ఇస్తామని శిలాఫలకం వేసి మరీ నారా లోకేష్ హామీ ఇచ్చారని, 'మన ఇల్లు - మన లోకేష్' అని చెప్పి రెండున్నరేళ్లు గడిచినా ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదని సూటిగా ప్రశ్నించారు. సంవత్సరానికి ఒకసారి సమావేశం పెట్టి కొద్దిమందికి మాత్రమే పట్టాలిచ్చి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. బడా కంపెనీలకు ఎకరం భూమిని 99 పైసలకే కేటాయించే ప్రభుత్వానికి, పేదలకు ఇచ్చిన మాట ప్రకారం 100 గజాల నివాస స్థలం ఇవ్వడానికి భూమి ఎందుకు లేదని ఆయన నిలదీశారు. గత పాతిక, ముప్పై ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు నియోజకవర్గవ్యాప్తంగా ఒక్క పట్టా కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. పేదలకు పట్టాలు ఇవ్వడానికి కేవలం సంతకం పెట్టడమే మిగిలి ఉన్నప్పటికీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేశామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం, అందులో పేదల ఇళ్ల స్థలాలను ఎందుకు చేర్చలేదని బాబురావు ప్రశ్నించారు. గత ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల కాగితాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని, కనీసం ప్రత్యామ్నాయంగా భూములు కూడా కేటాయించలేదని ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 'డబుల్, ట్రిపుల్ ఇంజిన్లు' ధరలు పెంచేందుకు మాత్రమే పనిచేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఓట్లు అడిగేందుకు మాత్రమే పేదలు గుర్తుకొస్తారా అని ప్రశ్నిస్తూ, పారిశ్రామికవేత్తల కోసం దేశవిదేశాలు తిరిగే నాయకులు, స్థానిక ప్రజల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గంలోని గ్రామగ్రామాన ఆందోళనలు కొనసాగిస్తామని, అక్టోబర్ 6వ తేదీన మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు సీపీఎం పోరాటం ఆగదని బాబురావు తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు సిపిఎం మండల కార్యదర్శి వుద్దంటి దుర్గారావు, సీనియర్ నాయకులు ముసలి పకీరయ్య, శాఖా కార్యదర్శి గడ్డం అజయ్ కుమార్, నాయకులు చిట్టేల సీతారామాంజనేయులు, వల్లభాపురం సాంబశివరావు, కటెవరపు శేషయ్య, దేపూరు పద్మనాభ శర్మ, కాండ్రు ఆంజనేయులు, పులివర్తి ప్రసాదు, గౌరబత్తుల లక్ష్మి , చిట్టేల గిరిధరరావు, మునగాల సంధ్య , బిట్రా రాంబాబు, కటివరపు లక్ష్మి, మునగాల శ్రీనివాసరావు, కోడూరు సుజాత, కత్తుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేంతవరకు పోరాటం ఆగదు : సిపిఎం నేత సిహెచ్.బాబురావు
37 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 04:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)