శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడ అభివృద్ధికి వామపక్షాలను గెలిపించండి....!

13 నిమిషాల క్రితం

విజయవాడ అభివృద్ధికి వామపక్షాలను గెలిపించండి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 09:10 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

సుపరిపాలన, స్వపరిపాలన, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, పన్నుల భారం లేని విజయవాడ అభివృద్ధి లక్ష్యాలతో ప్రజల ముందుకు వెళుతున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం వామపక్ష కార్పొరేటర్‌ అభ్యర్థుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ స్వతంత్ర మేయర్‌ అభ్యర్థి ఎబి. వెంకటేశ్వరరావుకు వామపక్షాలు, కాంగ్రెస్‌, ఇతర ప్రజాసంఘాలు మద్దతుగా నిలిచి పోటీలోకి దిగాయని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వామపక్షాలు ఐక్యంగా పోటీ చేస్తున్నాయని చెప్పారు. కార్పొరేషన్‌ పరిధిలో సిపిఎం 14, సిపిఐ 20 డివిజన్లలో అభ్యర్థులను నిలిపాయని వెల్లడించారు. మిగిలిన డివిజన్లలో కాంగ్రెస్‌, ఇతర అభ్యర్థులకు వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు. 1981-86, 1995-2000 మధ్యకాలంలో వామపక్షాలు నగరపాలక సంస్థను ఆదర్శవంతంగా నిర్వహించాయని, ప్రజలపై పన్నుల భారం వేయకుండా అభివృద్ధి చేశాయని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం, గత వైసిపి పాలనలో విజయవాడ అభివృద్ధి కుంటుపడిందని, నగరం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. విజయవాడను డెడ్‌ సిటీగా మార్చేశారని, మెట్రో రైలు ప్రాజెక్టు, బుడమేరు వరద నివారణ చర్యలు, గృహ నిర్మాణం, పేదలకు మెరుగైన వసతుల కల్పనలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. విజయవాడను కాపాడుకోవడంతోపాటు సంక్షేమం, అభివృద్ధి సాధించేందుకు వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిపిఐ నాయకులు నక్కా వీరభద్రరావు మాట్లాడుతూ గతంలో వామపక్షాల పాలనలో ప్రజలపై అధిక పన్నుల భారం వేయకుండా ప్రజారంజక పాలన అందించామని, మళ్లీ ఆ తరహా పాలనను తీసుకొస్తామని తెలిపారు. సిపిఎం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి డివి. కృష్ణ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధి చెందాలంటే గతంలో వామపక్షాలు అందించిన ఆదర్శవంతమైన, నిజాయితీతో కూడిన పాలన రావాలని అన్నారు. ఈ ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, ఇతర మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్పొరేటర్‌ అభ్యర్థులు ఎస్‌.కె. రషీదా బేగం, గంటా శ్రీదేవి, కాశీ పూర్ణ శివపార్వతి, బట్టా రజిని, ఎస్‌.కె. సాయిరా బాను, ఎలమంచిలి ఆదిలక్ష్మి, పంబా జ్యోతి, లక్ష్మీకుమారి, పతివాడ ప్రసాద్‌, బోరా ప్రసాద్‌, కోరాడ వెంకటరత్నం, కె. శివాజీ, సిపిఐ కార్పొరేటర్‌ అభ్యర్థి చాట్రగడ్డ అనిత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్