శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్‌టిసి జెఎసి, యాజమాన్యం చర్చలు విఫలం

21 నిమిషాల క్రితం

ఆర్‌టిసి జెఎసి, యాజమాన్యం చర్చలు విఫలం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 09:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రయివేటు ఆపరేటర్లకు 1,450 విద్యుత్‌ బస్సుల నిర్వహణకు ఇచ్చిన టెండర్లను రద్దు చేయాలని ఎపిపిటిడి (ఆర్‌‌టిసి) ఉద్యోగ సంఘాల జెఎసి నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై శుక్రవారం ఆర్‌‌టిసి హౌస్‌లో జెఎమ్‌డి శివప్రసాద్‌తో జరిగిన చర్చలు విఫలమయ్యాయని జెఎసి రాష్ట్ర కన్వీనర్లు వై శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు తెలిపారు. విద్యుత్‌ బస్సులను ఆర్‌‌టిసి సొంత సిబ్బందితోనే నిర్వహించాలని, ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటుపరం చేయరాదని జెఎసి నాయకులు స్పష్టం చేశారు. టెండర్ల రద్దు ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన అంశమని, వాటిని రద్దు చేయడం సాధ్యం కాదని జెఎమ్‌డి వెల్లడించినట్లు వారు తెలిపారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే మూసివేసిన విద్యాధరపురం, గుంటూరు 2, నెల్లూరు 2, మంగళం డిపోలను తిరిగి ప్రారంభించేందుకు టెండర్లు పిలిచి పనులు చేపడతామని యాజమాన్యం తెలిపిందన్నారు. ఆర్‌‌టిసి‌లో ఖాళీగా ఉన్న 15 వేల పోస్టులను భర్తీ చేయాలని, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు 4 వేలు డీజిల్‌ బస్సులను తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. స్త్రీశక్తి పథకంతో పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రవాణా సదుపాయాలు కల్పించడంతోపాటు, రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలకు మెరుగైన సేవలు అందించేందుకు బస్సుల కొనుగోలు అవసరమని పేర్కొన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిర్వహించిన నిరసనలు విజయవంతమయ్యాయని జెఎసి తెలిపింది. ఆర్‌‌టిసి హౌస్‌లో జరిగిన చర్చలకు నాయకులు నల్లబ్యాడ్జీలతో హాజరయ్యారు. ఉద్యోగుల ప్రయోజనాలు, ప్రజా రవాణా పరిరక్షణ కోసం భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జెఎసి కో కన్వీనర్లు పివి రమణారెడ్డి, జివి నరసయ్య, సిహెచ్ సుందరయ్య, కట్టా సుబ్రహ్మణ్యం, ఎస్‌‌వి శేషగిరిరావు, వైఎస్‌ రావు, కె సూర్యప్రకాశరావు, డి మాల్యాద్రితోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్