ప్రజాశక్తి - ఎడ్యుకేషన్
విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, 'ఇండియన్ ఎకనామిక్స్ అండ్ అలైడ్ సైన్సెస్ అసోసియేషన్' సంయుక్త ఆధ్వర్యంలో 'వికసిత్ భారత్ @2047' అనే అంశంపై ఈ నెల 19 నుండి 21 వరకు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు. మంగళవారం కళాశాలలో డైరెక్టర్ వేమూరి బాబూరావు, సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్ సి.జంపాల, అసోసియేషన్ కార్యదర్శి ప్రొఫెసర్ అలోక్ కుమార్, మీడియా ఆఫీసర్ డాక్టర్ సశ్రీతో కలిసి ఆయన సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. 19న ఉదయం 10 గంటలకు కానూరులోని పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమయ్యే ఈ సదస్సుకు అదానీ గ్రూప్ (స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్) సీఈఓ రాబిన్ భౌమిక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోపన్యాసం చేస్తారని తెలిపారు. ఎకనామిక్స్ సంఘం అధ్యక్షుడు ప్రొ. మోహన్ పటేల్ అధ్యక్షత వహిస్తారని, కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ దేవరాజ్.ఆర్, సింబోజియా గ్రూప్ డైరెక్టర్ డా. జి.ఎస్. రాణా అతిథి ఉపన్యాసం ఇస్తారని పేర్కొన్నారు. సిద్ధార్థ అకాడమి అధ్యక్షులు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి, నిమ్మగడ్డ లలితప్రసాద్, అకడమిక్ అడ్వైజర్ ప్రొ.ఎల్. కె.మోహనరావు మొదటి సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు. మొదటి రోజు ప్రొఫెసర్ ప్రసాదరావు ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక-ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అవకాశాలు, సవాళ్ల’పై ప్రసంగిస్తారని తెలిపారు. మూడు రోజుల పాటు పీబీ సిద్ధార్థ కళాశాల వేదికగా జరిగే ఈ సదస్సులో 106 మంది ప్రముఖులు పరిశోధన పత్రాలు సమర్పిస్తారని, ప్రత్యేక సంచికను విడుదల చేయనున్నామని వివరించారు. టిఎక్స్ (అమెరికా) ప్లానింగ్ హెడ్ హితేష్ మోహన్ అధ్యక్షతన ప్రత్యేక ఆన్‌లైన్ గోష్ఠి నిర్వహిస్తారన్నారు.







కామెంట్‌లు (0)