బాలల అక్రమ రవాణాను ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి సిబ్బంది అడ్డుకుని నలుగురు బాలలను కాపాడారు. తెనాలి జిఆర్‌పి ఎస్‌ఐ ఎల్.సరస్వతి వెల్లడించిన వివరాల ప్రకారం... విజయవాడ నుంచి బాపట్ల వరకు రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు. ఆర్‌పిఎఫ్ పోస్ట్ విజయవాడ, బాపట్ల, ఆర్‌పిఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ బాపట్ల బ్రాంచ్, జిల్లా బాలల సంరక్షణ విభాగం, ఎపి అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో శుక్రవారం ధన్బాద్-అలప్పుజా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న నలుగురు బాలలను గమనించారు. వారి ఆధార్ తదితర వివరాలు పరిశీలించి మైనర్లుగా నిర్థారించారు. వారితో పాటు ప్రయాణిస్తున్న ఒక అనుమానిత వ్యక్తి, పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకుని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ వ్యక్తి జార్ఖండ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాలలను, వారి తల్లిదండ్రులను సంప్రదించి, ఉపాధి కల్పిస్తామని నమ్మించి, హటియా రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చి, రైలు టికెట్లు ప్రయాణ ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చి వారిని తీసుకువెళుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనంతరం నలుగురు బాలలను, అనుమానిత వ్యక్తిని బాపట్ల రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చారు. అతని నుంచి రక్షించిన 17 ఏళ్ల బాలుడు, 15 యాళ్లలోపు ముగ్గురు బాలికలను గుంటూరు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యూసి) ఎదుట హాజరుపరచారు. కమిటీ ఆదేశాల మేరకు బాపట్లలోని ఎంఆర్ నగర్లో ఉన్న ది ఆర్ఫన్ ఇన్ ఏషియా చిల్డ్రన్స్ హోమ్‌కు తరలించారు. బాలల అక్రమ రవాణాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
బాలల అక్రమ రవాణాని అడ్డుకున్న ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026, 08:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)