- పోలీసుల అదుపులో మాజీ సర్పంచ్?
ప్రజాశక్తి- పిడుగురాళ్ల (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలో సర్పంచ్ పదవి కోసం టిడిపికి చెందిన రెండు గ్రూపుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మాజీ సర్పంచ్ బండ్ల నరసింహారావును శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువెళ్లారన్న వార్త గ్రామంలో కలకలం రేపింది. అయితే, ఆయనను పోలీసులే తీసుకువెళ్లారని నిర్దారణ కావడంతో గ్రామస్తులు శనివారం మాచవరం పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మాజీ సర్పంచులు బండ్ల నరసింహారావు, అంజయ్య మరోసారి సర్పంచ్ పదవిని ఆశిస్తూ తమ అనుయాయులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నరసింహారావు పోటీ చేసే అవకాశం ఉందంటూ పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో, పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి నరసింహారావును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న నరసింహారావు మద్దతుదారులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆయనను ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కార్యకర్తలను స్టేషన్ నుంచి బయటకు పంపేశారు. నరసింహారావుకు మద్దతుగా వచ్చిన పలువురు యువకులను ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసుల తీరుపై టిడిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీలో కీలకమైన వ్యక్తి ఆదేశాలతోనే పోలీసులు పాత కేసుల నెపంతో ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా నిరోధించి భయపెట్టేందుకు తీసుకెళ్లారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు, దాచేపల్లి సిఐ ఖాజావలి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానిక ఎస్‌ఐ పవన్‌కుమార్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ పవన్‌కుమార్ మాట్లాడుతూ గతంలో కేసులు ఉన్న వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని, అందులో భాగంగానే బండ్ల నరసింహారావును పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు చెప్పారు.







కామెంట్‌లు (0)