అధికార దుర్వినియోగం, పోలీసుల అడ్డంకులపై జక్కుల వీరస్వామి ఆవేదన...
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : దాచేపల్లి జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు బుధవారం నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లిన తాను, అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా నామినేషన్ వేయకుండానే వెనుదిరిగినట్లు దాచేపల్లికి చెందిన జక్కుల వీరస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసుల సహకారంతో కూటమి నాయకులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒక రైతుగా రైతాంగ సమస్యల పట్ల ఉద్యమాలు చేసే తనకు ఈ పరిణామాలు కలగడం తనను తీవ్రంగా కలచివేశాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుందని, నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా అవకాశం లేకుండా చేసే పరిస్థితులు ఆందోళనకరమన్నారు. అయితే, తాను వెనుకడుగు వేయబోనని, నామినేషన్ దాఖలుకు మరోసారి ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండు రోజుల సమయం ఉన్నప్పటికీ, అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకునే పరిస్థితులు నెలకొనడం ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలతో 2029 ఎన్నికలకు ముందే కూటమి ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయినట్లవుతుందన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చూడాలని, అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని జక్కుల వీరస్వామి కోరారు.







కామెంట్‌లు (0)