పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి
మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు...
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో ఆదివారం జరుగుతున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి తెలిపారు. రెండో విడతలో 52 గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నకరికల్లు మండలంలోని కుంకలగుంట, నర్సింగపాడు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూ లైన్ల నిర్వహణ, ఓటర్ల రాకపోకలు, జనసమూహాల నియంత్రణ, పోలీసు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ప్రాంతాలు కేటాయించాలని ఆదేశించారు.
మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న ప్రతి ఓటరుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)