నరసరావుపేట మండలం కేసానుపల్లిలోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో నిర్వహించిన ఈశ్వర్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)-1 క్రికెట్ టోర్నమెంట్‌లో ‘ఈశ్వర్ స్కై వారియర్స్’ విజేతగా నిలిచింది. 12 జట్ల మధ్య సాగిన టోర్నీలో ఫైనల్‌లో ఈశ్వర స్కై వారియర్స్ టైటిల్‌ను సొంతం చేసుకోగా రన్నరప్‌గా ఈశ్వర్ టార్గెట్ చేజర్స్ నిలిచింది. కళాశాలలోని మేజర్ ధ్యాన్‌చంద్ క్రికెట్ గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ.30 వేల నగదు బహుమతి, పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. రన్నరప్ జట్టుకు ట్రోఫీ, పతకాలు, సర్టిఫికెట్లు అందించారు. టోర్నీలో వ్యక్తిగత ప్రతిభ కనబరిచిన సర్దార్ ఎంవీపీ అవార్డును దక్కించుకోగా ఎస్.కె నజీర్ బెస్ట్ బౌలర్‌గా, మన్సూర్ బెస్ట్ బ్యాటర్‌గా,సర్దార్ బెస్ట్ ఫీల్డర్‌గా అవార్డులు అందుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ క్రీడలు ఆత్మవిశ్వాసం, క్రమ శిక్షణ, పట్టుదలను పెంపొందిస్తాయని చెప్పారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ఈపీఎల్‌లో విద్యార్థులు ప్రదర్శించిన క్రీడా ప్రతిభ, జట్టు స్ఫూర్తి అభినందనీయమన్నారు. క్రీడలు నాయకత్వ లక్షణాలు, సమయపాలన, పరస్పర సహకారాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్స్ మార్కెటింగ్ మేనేజర్ ఎం.రాజశేఖర్‌రెడ్డి, వసంత్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బండ్ల రామ్‌చంద్, కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ షేక్ కరీం మోహిద్దీన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నజీమా, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈపీఎల్-1 లో విద్యార్థులు ఉత్కంఠభరితంగా క్రికెట్ ఆడగా విజేతగా నిలిచిన ఈశ్వర్ స్కై వారియర్స్ ట్రోఫీ అందుకున్న సమయంలో మైదానం విద్యార్థుల కేరింతలతో మార్మోగింది. పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన సిబ్బందికి కళాశాల చైర్మన్ షేక్ మీరావలి కృతజ్ఞతలు తెలిపారు.








కామెంట్‌లు (0)