ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పల్నాడులో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు

11 నవంబర్, 2026

పల్నాడులో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 08:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

పల్నాడు జిల్లాలోని 512 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా బుధవారం తెలిపారు. ఈ నెల 26 నుండి వచ్చే నెల 3 వరకు ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులతో నరసరావుపేటలోని కలెక్టరేట్‌‌లో బుధవారం సమీక్షించిన కలెక్టర్‌ ‌మాట్లాడుతూ జిల్లాలోని 28 మండలాల పరిధిలో ఉన్న 512 గ్రామ పంచాయతీల్లో 5,286 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని, ఇందుకోసం 5,340 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. మొదటి దశలో నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో, 2వ దశలో సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో, 3వ దశలో మాచర్ల, గురజాల, చిలకలూరిపేట నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో ఎన్నికలు ఉంటాయని చెప్పారు. ఎన్నికల విధుల నిర్వహణ కోసం ఇప్పటికే 10,378 మంది పోలింగ్ సిబ్బందిని గుర్తించామని, వారికి ఎన్నికల ప్రక్రియపై అన్ని అంశాల్లో శిక్షణిస్తున్నామని తెలిపారు. మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన తరహాలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నామినేషన్, పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలను వీడియో చిత్రీకరణతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన చోట్ల అదనపు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష, జిల్లా రెవెన్యూ అధికారి అద్దయ్య, మూడు రెవెన్యూ డివిజన్ల అధికారులు పాల్గొన్నారు.

​

తుపాను నష్టాలపై పరిశీలనకు 14న కేంద్ర బృందం రాక

​ మురసు తుపానుతో జిల్లాలో వివిధ రంగాలకు జరిగిన నష్టాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ నెల 14న కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి క్షేత్ర స్థాయిలో నష్టాలను పరిశీలించనున్నట్లు చెప్పారు. వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య రంగాలకు జరిగిన నష్టాలను గ్రామాల వారీగా నమోదు చేయాలని, నీట మునిగిన పంటల విస్తీర్ణం, దెబ్బతిన్న ఉద్యాన పంటలు, పశుసంపద, మత్స్య సంపద నష్టాలను పక్కాగా అంచనా వేయాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లకు జరిగిన నష్టాలు, మరమ్మతుల ఖర్చు వివరాలను నివేదికలో పొందు పరచాలన్నారు. గ్రామీణ తాగునీటి పథకాలు, పైపులైన్లు, పంపింగ్ వ్యవస్థలకు జరిగిన నష్టాలను గుర్తించి పునరుద్ధరణ చర్యల వివరాలు అందించాలని ఆదేశించారు. దెబ్బతిన్న ఇళ్లను పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్నవిగా విభజించి బాధిత కుటుంబాల వివరాలతో నివేదికలు రూపొందించాలని, రహదారులు, డ్రెయినేజీలు, ప్రభుత్వ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను కూడా అంచనా వేయాలని సూచించారు.

34 బ్లాక్‌ స్పాట్లపై ప్రత్యేక దృష్టి

​పల్నాడు జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కృతికా శుక్లా, ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశించారు. కలెక్టరేట్‌‌లో బుధవారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 34 బ్లాక్‌ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఎన్‌హెచ్‌-167ఏ, ఎన్‌హెచ్‌-544డీ మార్గాల్లో ప్రమాదాలకు కారణాలను గుర్తించి లైటింగ్‌, హెచ్చరిక బోర్డులు, భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చాలని సూచించారు. రహదారులపై సంయుక్త తనిఖీల్లో గుర్తించిన లోపాల పరిష్కారానికి గడువుతో కూడిన నివేదికలు సమర్పించాలని ప్రాజెక్టు డైరెక్టర్లను ఆదేశించారు. ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందేలా 104, 108 సేవలను మెరుగుపర్చాలని, పిఎం-రాహత్‌ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. సమావేశంలో రవాణా శాఖ జిల్లా అధికారి సంజీవ్‌ కుమార్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్