మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్మికులు ఐక్యంగా పోరాడాలి

30 జులై, 2026

pat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 12:21 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా, కలెక్టరేట్‌కు ర్యాలీ

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్రంలోని 66 రంగాల్లో ప్రైవేట్ యాజమాన్యాల వద్ద పనిచేస్తున్న 50 లక్షల మంది కార్మికులకు చట్టబద్ధంగా ప్రతి ఐదేళ్లకోసారి అమలు చేయాల్సిన కనీస వేతనాల సవరణను వరుస ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని సీఐటీయూ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజయ్ కుమార్ విమర్శించారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం గాంధీ పార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామ పారిశుధ్య కార్మికులు ఇతర నిర్మాణ కార్మిక సంఘాల ప్రతినిధులు, కౌలు రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిఐటియు పల్నాడు అధ్యక్షులు బండ్ల మహేష్ అధ్యక్షత వహించారు. ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ 2012, 2017, 2022 సంవత్సరాల్లో జరగాల్సిన కనీస వేతనాల సవరణను అమలు చేయకుండా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలతో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా యజమానులకు వేల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ఫలితంగా ప్రస్తుతం హెల్పర్, ఆఫీస్ బాయ్, అన్స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం వీడీఏతో కలిపినా నెలకు రూ.12 వేల నుంచి రూ.13 వేల మధ్యనే కొనసాగుతుందన్నారు. చట్టం ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి వీడీఏను బేసిక్ వేతనంలో విలీనం చేసి 15 నుంచి 20 శాతం వరకు వేతనాలు పెంచి ఉంటే ప్రస్తుతం కనీస వేతనం రూ.19 వేల నుంచి రూ.22 వేల వరకు ఉండేదని తెలిపారు.నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కార్మికుల జీవన వ్యయం గణనీయంగా పెరిగిందని, వీడీఏ మాత్రమే ఆ భారాన్ని పూర్తిగా భర్తీ చేయలేదన్నారు. కుటుంబ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఐదేళ్లకోసారి వేతనాల సవరణ తప్పనిసరిగా చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించడం కార్మిక హక్కులకు విఘాతం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాల పెంపు పూర్తి స్థాయిలో న్యాయం చేయకపోయినా, కర్ణాటక ప్రభుత్వం సుమారు 60 శాతం వరకు వేతనాలు పెంచి అన్స్కిల్డ్ కార్మికులకు రూ 20,350 నుంచి రూ 24,407 వరకు కనీస వేతనాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనీస వేతనాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1957లో జరిగిన 15వ భారత కార్మిక మహాసభ తీర్మానం, 1992 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికుల జీవన అవసరాలకు అనుగుణంగా కనీస వేతనాలు నిర్ణయించాలని పేర్కొన్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీస స్థాయి కార్మికునికి నెలకు రూ 26 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో పాటు యాజమాన్యాలు కూడా కార్మికులను మోసం చేస్తున్నాయని, 6 నెలలకోసారి చెల్లించాల్సిన వీడీఏ, 8 గంటలకు మించి పనిచేస్తే ఇవ్వాల్సిన రెట్టింపు వేతనాలు అమలు చేయకుండా కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. కార్మిక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల పెంపు కోసం నిర్వహిస్తున్న ఉద్యమాల్లో అన్ని రంగాల కార్మికులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నిరసనకారులు కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్