ప్రజాశక్తి - కురుపాం /జియ్యమ్మవలస (పార్వతీపురం మన్యం జిల్లా) : ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు శత్రుచర్ల విజయరామరాజు అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వగ్రామమైన పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య ముగిశాయి. పోలీసు గౌరవ వందనం, గన్ సెల్యూట్‌తో తుది వీడ్కోలు పలికారు. అనంతరం కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపిగా, ఎమ్మెల్సీగా, పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన శత్రుచర్లకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గౌరవం ప్రకటించింది. తమ నాయకుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు గ్రామానికి వేలాది మంది చేరుకున్నారు. అంత్యక్రియల్లో శాసనమండలిలో వైసిపి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, మాజీ మంత్రి, మాజీ ఉమ్మడి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు, పలువురు ఎమ్మెల్సీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.








కామెంట్లు (0)