బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పలకలతో డ్రైనేజీకి అడ్డంకులు

1 గంట క్రితం

Obstructions to the drainage system caused by slabs.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 12:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పంచాయతీ పారిశుద్ధ్య చర్యలు పరిశీలించిన ఇన్‌చార్జి ఎంపీడీఓ విజయ్‌కుమార్‌


ప్రజాశక్తి–కురుపాం (మన్యం) : కురుపాం మేజర్‌ పంచాయతీలో అధికారులు నిత్యం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ డ్రైనేజీ కాలువలపై పలకలు అమర్చడంతో కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయలేకపోతున్నారు. దీంతో బుధవారం ఆర్‌అండ్‌బీ కార్యాలయం సమీపంలో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంచాయతీ ఈఓ ఎ.వెంకట నాయుడు ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను ఇన్‌చార్జి ఎంపీడీఓ విజయ్‌కుమార్‌ పరిశీలించారు. అనంతరం కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను పారిశుద్ధ్య కార్మికులతో తొలగింపజేశారు. అయితే డ్రైనేజీ కాలువలపై పలకలు ఉండటంతో మురుగునీరు పూర్తిస్థాయిలో వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాలువ సమీపంలోని ఓ వ్యాపారి స్వచ్ఛందంగా తన షాపు ముందు ఉన్న పలకను తొలగించి పంచాయతీ సిబ్బందికి సహకరించారు. దీంతో కాలువలో పేరుకుపోయిన చెత్తను కొంతమేర తొలగించి మురుగునీటి ప్రవాహానికి మార్గం కల్పించారు. అయితే మురుగునీరు రహదారిపైకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ప్రజల సహకారం అవసరం : ఇళ్ల, దుకాణాల ముందు డ్రైనేజీ కాలువలపై ఏర్పాటు చేసిన పలకలను ప్రజలు స్వచ్ఛందంగా తొలగించి పంచాయతీ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ప్రజల సహకారం లేకపోతే కాలువల్లో మురుగు మరింతగా పేరుకుపోయి దుర్వాసనతో పాటు దోమల బెడద పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజల భాగస్వామ్యంతోనే పంచాయతీని పరిశుభ్రంగా ఉంచగలమని పేర్కొన్నారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్