ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు శాస్త్రీయ పద్ధతులు పాటించాలి
ప్రజాశక్తి - గరుగుబిల్లి (మన్యం) : మండల పరిధిలోని దత్తివలస గ్రామంలో బుధవారం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) విజయనగరం ఆధ్వర్యంలో ఎల్‌నినో ప్రభావం, ప్రధాన పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై కిసాన్ గోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. గుమ్మలక్ష్మీపురం ఏడీఏ ఆర్.అన్నపూర్ణ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు పంటల ఎంపిక, నీటి వినియోగం, సమగ్ర పంటల యాజమాన్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. సీతంపేట ఏఆర్‌ఎస్ సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డా. పి.వెంకటరావు మాట్లాడుతూ వరి తదితర ప్రధాన పంటల్లో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పంటలపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చన్నారు. కేవీకే రస్తాకుంటుబాయి సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డా. ఎస్.ధూరువా మాట్లాడుతూ నీటి పొదుపు, సమగ్ర పోషక యాజమాన్యానికి రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కేవీకే శాస్త్రవేత్తలు డా. ఎస్.శ్రావంతి, డా. ఎం.అనంత విహారి రైతులతో ముఖాముఖి చర్చ నిర్వహించి వరి పంటలో నీటి యాజమాన్యం, కలుపు, పురుగు, తెగుళ్ల నివారణతో పాటు ఎల్‌నినో పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు కలిసి గ్రామంలోని వరి పంట పొలాలను సందర్శించి పంట పరిస్థితిని పరిశీలించారు. రైతులకు పొలస్థాయిలో అవసరమైన సాంకేతిక సూచనలు అందించారు. కార్యక్రమంలో డీఆర్‌సీ పార్వతీపురం ప్రతినిధులు శారద, సృజన, ఎంఏఓ జ్యోత్స్న, ఎంహెచ్‌ఓ సంధ్య, ఏఈఓ హరీష్, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)