కురుపాంలో ఆదివాసీ గిరిజన సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం
ప్రజాశక్తి–కురుపాం (మన్యం) : జిఒ నంబర్ 3కు ప్రత్యామ్నాయ చట్టం తీసుకురావడంతో పాటు 1/70 చట్టాన్ని రక్షించాలని, గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరిక అశోక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కురుపాంలో ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు కోరంగి సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో అశోక్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కురుపాం బహిరంగ సభలో జీఓ నంబర్ 3ను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్నా హామీ అమలుకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. గిరిజనుల హక్కులను కాపాడేందుకు 1/70 చట్టంపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కావాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 27న కురుపాంలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మండంగి రమణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.అనిల్‌కుమార్, గిరిజన సమాఖ్య నాయకులు ప్రసాద్, లింగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొల్లి గంగునాయుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.వి.రమణ, ఎన్.వై.నాయుడు, ఐద్వా జిల్లా కార్యదర్శి బి.లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)