భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తుపై ఆరా
ప్రజాశక్తి-ఒంగోలు సిటీ : ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించారు. నగరంలోని డాన్ బాస్కో, ఆగ్జీలియం తదితర పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఓటు వేసేందుకు ఏర్పాటు చేసిన క్యూలైన్లను, ఓటింగ్ ప్రక్రియను, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరును పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తును సమీక్షించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.








కామెంట్‌లు (0)