ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి
కలెక్టర్‌కు సీపీఎం, ఇతర ప్రతిపక్షాల విజ్ఞప్తి
దర్శి, ఒంగోలులో ఘటనలపై ఫిర్యాదు.. విచారణకు డిమాండ్
ప్రజాశక్తి – ఒంగోలు సిటీ : ప్రతిపక్ష అభ్యర్థులు ఎలాంటి అడ్డంకులు, బెదిరింపులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునే వాతావరణం కల్పించాలని సీపీఎం నాయకులు జిల్లా కలెక్టర్ పి. రాజబాబును కోరారు. దర్శితోపాటు ఒంగోలు నగరంలోనూ ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్.కె. మాబు, నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్ తదితరులు ఈ అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దర్శిలో వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్న ఘటనలతోపాటు, ఒంగోలు నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్నట్లు వచ్చిన అక్రమాలను వివరించారు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసుల వ్యవహారశైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు, ప్రతినిధులు ఇటువంటి చర్యలను ఖండించారు.
అన్ని ప్రాంతాల్లో రిటర్నింగ్ అధికారులు ఒకే విధమైన నిబంధనలు, నామినేషన్ చెక్‌లిస్టును అనుసరించేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రతిపక్ష నాయకులు కోరారు. అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు భద్రత కల్పించాలని, ఫిర్యాదులపై న్యాయ విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ సమావేశంలో డీఆర్వో వెంకటరమణ, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి పాల్గొన్నారు. అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఓటరు జాబితాలను మంగళవారం సాయంత్రానికి అందుబాటులోకి తెచ్చి, బుధవారంలోగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు అందజేస్తామని జడ్పీ సీఈఓ వెల్లడించారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు అధికారిక మార్గదర్శకాలు, చెక్‌లిస్టును పరిశీలించి, అవసరమైన పత్రాలతో నిర్ణీత గడువులోగా నామినేషన్లు సమర్పించాలని సమావేశంలో సూచించారు.








కామెంట్‌లు (0)