జిల్లా ఎన్నికల పరిశీలకురాలు కె. హెప్సిబా రాణి
విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి సంబంధిత అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు కె. హెప్సిబా రాణి తెలిపారు. ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, ఈఓలు, ఏఈఓలకు మంగళవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పి. రాజాబాబు, ఎన్నికల వ్యయ పరిశీలకుడు వివేక్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు.
పోలింగ్ ఏజెంట్లు, పోస్టల్ బ్యాలెట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోలింగ్ కేంద్రంలోకి అనుమతి, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, వీడీటీ బృందాల పనితీరు, తనిఖీల సమయంలో అనుమానాస్పద నగదు, వస్తువులను స్వాధీనం చేసుకునేటప్పుడు అనుసరించాల్సిన విధానాలపై శిక్షణ కార్యక్రమాల నోడల్ అధికారి ఎం. వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల పరిశీలకురాలు కె. హెప్సిబా రాణి మాట్లాడుతూ ఎన్నికల విధుల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో సాధారణ ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. వివాహ, వైద్య ఖర్చుల కోసం నగదును తీసుకెళ్తున్నవారు తగిన ఆధారాలు సమర్పిస్తే, నిబంధనల మేరకు అనుమతించాలని తెలిపారు.
కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు, అంటే మరో నెలన్నర రోజులపాటు సిబ్బంది తమకు కేటాయించిన విధుల్లో కొనసాగాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సమర్పించాల్సిన నివేదికలను సకాలంలో అందజేయాలని సూచించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ దిశగా నియమించిన నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. శిక్షణ అనంతరం ఎన్నికల పరిశీలకురాలి సూచన మేరకు సిబ్బందికి సంబంధిత అంశాలపై అవగాహనను పరీక్షించేందుకు పరీక్ష నిర్వహించారు. అనంతరం సిబ్బంది అడిగిన సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బి. చిరంజీవి, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)