శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెరిదేపి సిపిఎం ఎంపీటీసీ అభ్యర్థిగా పుట్టా విజయలక్ష్మి నామినేషన్‌

22 అక్టోబర్, 2026

cpm ongel.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 06:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – కొండపి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. మాబు పిలుపునిచ్చారు. పెరిదేపి ఎంపీటీసీ అభ్యర్థిగా పుట్టా విజయలక్ష్మి గురువారం నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా పెరిదేపి, మిట్టపాలెం గ్రామాలకు చెందిన సిపిఎం శ్రేణులు కొండపిలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాబు మాట్లాడారు. అమరజీవి ముప్పరాజు శేషయ్య స్ఫూర్తితో కొండపి మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో అనేక ప్రజా ఉద్యమాలు సాగాయని మాబు గుర్తుచేశారు. కార్మికులు, కర్షకులు, కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలను చైతన్యపరుస్తూ ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిన చరిత్ర సిపిఎంకు ఉందన్నారు. సాగునీరు, తాగునీరు, గిట్టుబాటు ధరలు, కనీస వేతనాల సాధన, ధరల పెరుగుదలను అరికట్టడం వంటి అంశాలపై పార్టీ నిరంతరం పోరాడిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించడంలో సిపిఎం ముందుంటుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని మాబు అన్నారు. ఓటు హక్కుకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయని పేర్కొంటూ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం జరిగే పోరాటాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు.

సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ సమాజంలో కొనసాగుతున్న కుల, మత ఉన్మాదాన్ని అరికట్టి ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించేందుకు సిపిఎం నిరంతరం కృషి చేస్తోందన్నారు. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన మౌలిక హక్కుల పరిరక్షణకు పార్టీ నికరంగా నిలబడుతోందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. పెరిదేపి ఎంపీటీసీ స్థానంలో సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుట్టా విజయలక్ష్మిని గెలిపించడం ప్రజా ఉద్యమాలకు బలాన్నిస్తుందని ఆంజనేయులు అన్నారు. ప్రజలంతా సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కేజీ మస్తాన్‌, కంకణాల రమాదేవి, మండల కార్యదర్శి మల్లెల కొండయ్య, సీనియర్‌ నాయకులు ఎం. పెద్ద పేతురు, ముప్పరాజు బ్రహ్మయ్య, టంగుటూరి రాము, పుట్ట రామారావు, గడ్డం పిచ్చయ్య, కామనీ బ్రహ్మయ్య, రావిపాటి నరసింగరావు, వేజెండ్ల సింగయ్య, సీహెచ్‌. వినోద్‌, అంగలకుర్తి బ్రహ్మయ్య, సూరిబాబు, దావీదు, విశ్రాంత మాధవి, ఆదిలక్ష్మి, పరిశుద్ధ రావు, రవీంద్ర, సుకన్య, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్