- హామీలు అమలు చేయని ప్రభుత్వంపై భగ్గుమన్న అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, వీఓఏలు
- రూ.26 వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతే ప్రధాన డిమాండ్
- పరిష్కారం లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక
ప్రజాశక్తి – ఒంగోలు సిటీ (ప్రకాశం) : ప్రభుత్వ సంక్షేమ పథకాలను భుజాన మోస్తూ ప్రజలకు సేవలందిస్తున్న స్కీమ్ వర్కర్లు తమ హక్కుల కోసం మరోసారి పోరుబాట పట్టారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందంటూ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మధ్యాహ్న భోజన పథక కార్మికులు, వెలుగు వీఓఏలు శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నాతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది స్కీమ్ వర్కర్లు పాల్గొని కలెక్టరేట్‌ను హోరెత్తించారు.
"సంక్షేమం మాతోనే... భద్రత మాత్రం లేదా ?" అంటూ స్కీమ్ వర్కర్లు ప్రభుత్వాన్ని నిలదీశారు. కోట్లాది రూపాయల సంక్షేమ పథకాలను అమలు చేయించేది తమేనని, కానీ తమకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పెన్షన్, బీమా వంటి ప్రాథమిక హక్కులు కూడా కల్పించడం లేదని మండిపడ్డారు. పథకాల ప్రచారంలో ముందుండే ప్రభుత్వం, వాటిని అమలు చేస్తున్న కార్మికుల జీవితాలను మాత్రం గాలికొదిలేసిందని విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలు రూ.26 వేల కనీస వేతనం, ప్రభుత్వ ఉద్యోగుల హోదా, పెన్షన్, గ్రాట్యుటీ, బకాయిల చెల్లింపు, 5జీ ట్యాబ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2.0 యాప్, ఫేస్ రికగ్నిషన్ పేరుతో పనిభారం రెట్టింపు చేసి, పాత ఫోన్లతో యాప్ పనిచేయకపోయినా అధికారుల వేధింపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథక కార్మికులు "గ్యాస్ సరఫరా చేయకుండా పిల్లలకు భోజనం ఎలా వండాలి?" అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇస్తున్న వంట ఖర్చుతో మెనూ అమలు అసాధ్యమని, నెలల తరబడి బిల్లులు రాక అప్పులు చేసి, నగలు తాకట్టు పెట్టి భోజనం వండుతున్నామని వాపోయారు. వంట ఖర్చు పెంచడంతో పాటు నెలకు రూ.10 వేల వేతనం, 12 నెలల జీతం, బీమా, బకాయిల చెల్లింపు, స్మార్ట్ కిచెన్ల ప్రతిపాదనల ఉపసంహరణను డిమాండ్ చేశారు. వెలుగు వీఓఏలు "పని మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ... వేతనం మాత్రం అరకొర" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఆర్ పాలసీ, ప్రమోషన్లు, ఉద్యోగ భద్రత, రూ.10 లక్షల బీమా, రూ.26 వేల కనీస వేతనం, బకాయిల చెల్లింపు, రాజకీయ వేధింపుల నిలుపుదల వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ధర్నాకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ అధ్యక్షత వహించగా, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, ఉపాధ్యక్షులు సీహెచ్ మజుందర్ మాట్లాడుతూ ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వానికి ఈ పోరాటం హెచ్చరిక అని స్పష్టం చేశారు. స్కీమ్ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టర్ సందేశాన్ని తెలియజేస్తూ, స్కీమ్ వర్కర్ల సమస్యలపై యూనియన్ నాయకులతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని హామీ ఇచ్చారు. అయితే హామీలతో కాలయాపన కాకుండా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్, జి.వి.కొండారెడ్డి, జి.వెంకటేశ్వర్లు, జి.శ్రీనివాసులు, జీవీబీ కుమార్, ఇందిరావతి, పరిశుద్ధమ్మ, అరుణ రాజ్యలక్ష్మి, గంగాధరి, జాన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)